Telangana Politics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలో బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లిన నేతలంతా.. ఇప్పుడు తిరిగి అధికార కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు.
నేడు భారీగా చేరికలు..
తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరపాలక సంస్థ మొదటి మేయర్‌గా పనిచేసిన బొంతు రామ్మోహన్.. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఆయన శుక్రవారం(ఫిబ్రవరి 16న)న అధికారికంగా కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రరెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డితోపాటు మరికొందరు నేతలు కాంగ్రెస్‌లో శుక్రవారం చేరబోతున్నారు. కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి దీపదాస్ మున్సి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈమేరకు గాంధీ భవన్‌లో ఏర్పాట్లు చేశారు.
లోక్‌సభ ఎన్నికల ముందు..
లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాల్లో గెలిచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఉపశమనం పొందాలని చూస్తున్న బీఆర్‌ఎస్ పార్టీని వరుస షాక్‌లు కలవరపెడుతున్నాయి. ఒకవైపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పార్టీ బలోపేతం చేస్తామని నియోజకవర్గ పర్యటనలు చేస్తుంటే.. నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన నీలం మధు ముదిరాజ్, బొంతు రామ్మోహన్, కేసీఆర్‌కు సన్నిహితుడైన పట్నం మహేందర్ రెడ్డి వంటివారు కూడా పార్టీని వీడడం గులాబీ శిబిరాన్ని కలవర పెడుతోంది.