Nijamabad : తెలంగాణ అంటేనే.. ముక్క ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఎలాంటి కార్యమైనా సరే.. ముక్కలేనిది చాలామందికి ముద్ద కూడా దిగదు. మటన్ లేదా చికెన్ ముక్కలు పెట్టని పెళ్లిళ్లలో గొడవలు కూడా జరిగాయి. అవి దాడులకు, ప్రతిదారులకు, చివరికి హత్యల దాకా దారి తీసాయి. అందుకే తెలంగాణలో పెళ్లి తంతు ఎలా జరిగినప్పటికీ.. విందు విషయంలో ఏ కుటుంబం కూడా వెనకడుగు వేయదు. పైగా నాలుగు ముక్కలు ఇంకా ఎక్కువగానే వేస్తారు. కొన్నిచోట్ల మద్యం కూడా సర్వ్ చేస్తారు. ఇందులో ఏమాత్రం తేడా జరిగినా ఇక అంతే సంగతులు. “ముక్క ఉండాలి. బొక్క కొరకాలి. మందు నోట్లో పడాలి. దావత్ బిందాస్ గా ఉండాలి.. ఇందులో కాస్త అటూ ఇటూ అయినా గొడవలు పుట్టుకొచ్చేస్తుంటాయని” తెలంగాణ పల్లెల్లో పెద్దలు వ్యాఖ్యానిస్తూ ఉంటారు.. అందువల్లే జరిగే కార్యాన్ని (పెళ్లి వేడుకను) ఎరుకతో నిర్వహించాలని చెబుతుంటారు. అయితే నిజామాబాద్ జిల్లాలో పెళ్లి భోజనంలో మాంసాహారం వడ్డించే విషయంలో జరిగిన గొడవ సంచలనానికి దారి తీసింది.
పరస్పరం దాడి చేసుకున్నారు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలో బుధవారం ఓ వివాహం జరిగింది. నవీపేట ప్రాంతానికి చెందిన యువతికి నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుక నవీపేటలోని ఫంక్షన్ హాల్ లో జరిగింది. వివాహం అనంతరం వచ్చిన బంధువులకు విందు ఏర్పాటు చేశారు. విందులో భాగంగా మాంసాహారం వడ్డించారు. వరుడి తరఫున వచ్చిన కొందరు తమకు మాంసాహారంలో ముక్కలు తక్కువగా వేశారని.. వడ్డించే వ్యక్తులతో గొడవకు దిగారు. అయితే ఇది చినికి చినికి గాలి వాన లాగా మారింది. మధ్యలోకి పెళ్లి కుమార్తె తరఫున బంధువులు వచ్చి కల్పించుకున్నారు. దీంతో అటు వరుడు తరుపు బంధువులు, ఇటు వధువు తరుపు బంధువులు పరస్పరం గొడవపడ్డారు. వంట గరిటలు, రాళ్లు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒకసారిగా అక్కడ పరిస్థితి అదుపుతప్పింది. కొందరు పోలీసులకు ఫోన్ చేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారిని శాంతింప చేశారు. ఇందులో ఒక వర్గాన్ని చెందిన ఈర్నాల సత్యనారాయణ తో పాటు మరో కొంతమంది.. మరో వర్గాలు చెందిన పత్రి సాయిబాబా తో పాటు మరో ఆరుగురి పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో గాయపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది.. సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీస్తోంది. యాటకూర విషయంలో తలెత్తిన ఈ గొడవ బలగం సినిమాను గుర్తు చేసిందని ఆ చుట్టుపక్కల వాళ్ళు వ్యాఖ్యానించడం విశేషం.