Mamata Banerjee: మమతా బెనర్జీకి ప్రమాదమా? కుట్ర కోణం ఉందా?

మమతా బెనర్జీ ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. వాకింగ్ చేస్తుండగా ఆమె అదుపుతప్పి పడిపోయారని, దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయని అంటున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : March 15, 2024 11:54 am

Mamata Banerjee

Follow us on

Mamata Banerjee: కమ్యూనిస్టు పార్టీకి ఎదురొడ్డి.. పశ్చిమ బెంగాల్లో ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి గాయపడ్డారు. నుదుటిన గాయం కావడంతో.. రక్తస్రావమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఒక్కసారిగా మమతా బెనర్జీ పేరు అటు మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో మమతా బెనర్జీ ప్రమాదవశాత్తూ గాయపడ్డారా?, లేక ఎవరైనా కావాలని చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మమతా బెనర్జీ ట్రెడ్ మిల్ పై వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. వాకింగ్ చేస్తుండగా ఆమె అదుపుతప్పి పడిపోయారని, దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలు అయ్యాయని అంటున్నారు. వెంటనే కోల్ కతా లోని ఆసుపత్రికి తరలించారని.. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ” మమతకు పెద్ద గాయమైంది. ఆమెకు రక్తస్రావమవుతోంది. ఆమె క్షేమంగా ఉండాలని అందరూ కోరుకోండి. ప్రార్థనలు చేయండంటూ” అని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

మమతకు అయిన గాయం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రెడ్ మిల్ మీద వాకింగ్ చేస్తుంటే.. నుదుటికి ఎందుకు గాయం అవుతుంది? ఒకవేళ గాయమైనప్పటికీ.. రక్తాన్ని ఎందుకు తుడవలేదు. ఆ రక్తం అలా కారుతుంటే మిగతావారు ఏం చేస్తున్నారు? భద్రతా సిబ్బంది పక్కన లేరా? ముఖ్యమంత్రికి ఆ స్థాయిలో గాయమైతే ఆసుపత్రికి వచ్చేదాకా అలానే ఉంచుతారా? ఈ ఘటనపై మాకు అనుమానాలున్నాయంటూ” బిజెపి నాయకులు అంటున్నారు. “గతంలో ఎన్నికల సమయంలో కాలుకు గాయమైనట్టు మమత బెనర్జీ పెద్ద కట్టుకట్టుకున్నారు. అలానే ఆమె ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాలికి ఉన్న కట్టు మాయమైంది. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆమె ఆసుపత్రి పాలయ్యారు. నుదుటికి గాయమైందని చెబుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఎన్నికల స్టాంట్లు చేస్తున్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయని” బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఒక స్పష్టత ఇవ్వడం లేదు. పైగా ఒక్కొక్కరు ఒక్క విధమైన కారణాలు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం మమతా బెనర్జీ కోల్ కతా లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.