Konda Surekha: రాజకీయ నాయకులు ముఖ్యంగా పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి విషయంలోనూ అత్యంత సెక్యూర్డ్ విధానాన్ని పాటించాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి సంబంధించిన పరిణామాలు కూడా అదే విధంగా ఉంటాయి. పైగా ప్రజా జీవితంలో ఉన్నవారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురికావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇదే పరిస్థితిని తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి రోజుల్లో కొండా సురేఖ సినీ నటుడు నాగార్జున కుటుంబం మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారు.. దీంతో ఆయన కోర్ట్ దాకా వెళ్లారు.. అంతేకాదు కోర్టులో నాగార్జున, ఆయన కుమారుడు నాగచైతన్య వాంగ్మూలాలు కూడా ఇచ్చారు.. తదుపరి రోజున కొండా సురేఖ మీద న్యాయస్థానం చర్యలు తీసుకునే సమయం నాటికి ఆకస్మాత్తుగా రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.. దీంతో నాగర్జున తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. ఒక రకంగా అది కొండా సురేఖకు ఉపశమనం కలిగించింది.. దీన్ని మర్చిపోకముందే మరో కేసులో కొండా సురేఖ ఇరుక్కున్నారు.
అప్పట్లో మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ విమర్శలు చేశారు. దీంతో ఆయన కోర్టు దాకా వెళ్లారు. పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కొండా సురేఖ మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.. తనకు కోర్టు నోటీసులు మాత్రమే దాఖలు చేసిందని.. వచ్చేనెల ఐదున తాను విచారణకు హాజరవుతానని ఆమె పేర్కొన్నారు. తనపై విమర్శలు చేసిన నేపథ్యంలో కొండా సురేఖ పై కోర్టుకు వెళ్లిన కేటీఆర్.. లీగల్ గానే చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున ఎపిసోడ్లో రంగంలోకి దిగి సెటిల్ చేసిన రేవంత్ రెడ్డి.. కేటీఆర్ వ్యవహారంలో ఏమీ చేసే పరిస్థితి లేదు. రాజకీయంగా కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు కేటీఆర్ దూకుడును రేవంత్ ఎలా కట్టడి చేయగలుగుతారు? సురేఖను ఏ విధంగా కాపాడగలుగుతారు? ఇప్పుడు ఈ ప్రశ్నలకే సమాధానాలు లభించాల్సి ఉంది.