HomeతెలంగాణSuvarnabhumi MD: ప్లాట్ల పేరుతో కుచ్చుటోపీ.. సువర్ణభూమి ఎండిపై కేసు

Suvarnabhumi MD: ప్లాట్ల పేరుతో కుచ్చుటోపీ.. సువర్ణభూమి ఎండిపై కేసు

Suvarnabhumi MD: రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త విధానాలు, వినూత్నమైన ప్రచార ఆర్భాటాలతో వేలాది మంది కస్టమర్లను సంపాదించుకున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి ఎండిపై చీటింగ్ కేసు నమోదు అయింది. వినియోగదారుల నుంచి డబ్బు కట్టించుకుని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఎండితోపాటు ఆ సంస్థకు చెందిన మరో నలుగురిపై కేసులు నమోదయ్యాయి. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలోకి అనేకమంది ప్రముఖులు, అనేక సంస్థలు వస్తున్నాయి. ఈ కోవలోకి చెందినదే సువర్ణభూమి సంస్థ. అయితే, గత కొన్నేళ్లుగా వినియోగదారుల ఆదరాభిమానాలను ఈ సంస్థ చూరగొనడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేలాది మంది కస్టమర్లు ఆ సంస్థకు చేరువయ్యారు. అయితే, ఆ సంస్థకు చెందిన అధికారులు వినియోగదారులను మోసం చేశారన్న కారణంగా ఎండితోపాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంస్థకు సంబంధించిన కస్టమర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎండి బొల్లినేని శ్రీధర్ సహా పలువురుపై కేసు నమోదు..

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్లాట్లు విక్రయిస్తామంటూ పలువురు వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యండి బొల్లినేని శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేక శ్రీనివాస్, ఉద్యోగులు గంగిరెడ్డి, దస్తగిరితోపాటు మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇవీ..

సువర్ణభూమి సంస్థ 2017లో షాద్
నగర్ సమీపంలోని సువర్ణ కుటీర్ పేరుతో వెంచర్ ను ప్రారంభించింది. ఈ వెంచర్ లో కృష్ణానగర్ కు చెందిన కొండలరావు అనే వ్యక్తితోపాటు సినీ పరిశ్రమలో పనిచేసే 21 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. ఇందుకోసం సదరు సంస్థ ప్రత్యేకంగా ఆఫర్లను కూడా అందిస్తూ వినియోగదారులను పెంచుకుంది. ఒక్కో వినియోగదారుడు ఆరు లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నగదు చెల్లించి ఈ వెంచర్ లో ప్లాట్లను కొనుగోలు చేశారు. వీరిని సంస్థ ఉద్యోగి దస్తగిరి షాద్ నగర్ తీసుకువెళ్లి ప్లాట్లను చూపించి వారితో డబ్బులు కట్టించాడు. ఆ తర్వాత సంస్థకు సంబంధించిన ఎండి బొల్లినేని శ్రీధర్ తదితరులతో పలుమార్లు మాట్లాడి వాయిదాలలో పూర్తి డబ్బులు చెల్లించేశారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి గత కొంతకాలం నుంచి తప్పించుకు తిరుగుతుండడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ లోని సంస్థ కార్యాలయానికి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీయుగా వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

20 శాతమే ముట్టిందంటున్న యాజమాన్యం..

అయితే, ఈ వ్యవహారంపై సువర్ణభూమి యాజమాన్యం మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. వినియోగదారుల చెల్లించిన సొమ్ములో 20 శాతం మాత్రమే సంస్థకు ముట్టిందని యాజమాన్యం చెబుతోంది. మిగిలిన డబ్బు తమకు అందలేదని వెల్లడించింది. పూర్తి డబ్బు చెల్లించకుండా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేమని యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు చెబుతున్నారు. వారి మాటలు విని ఆందోళనకు గురైన బాధితులు తమ పూర్తిగా నగదు చెల్లించామని రశీదులను చూపించారని, వాటిని చూసిన యాజమాన్యం అందులో కొన్ని మాత్రమే అసలైనవని, మిగిలినవి ఫేక్ రశీదులని యాజమాన్యానికి సంబంధించిన ప్రతినిధులు చెబుతున్నారు. వాటితో తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సువర్ణభూమి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular