IAS officer shocks to minister: రేవంత్ ముఖ్యమంత్రి అయిన తొలి రోజులవి. కాళేశ్వరం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్న రోజులు కూడా అదే. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ కొన్ని కీలక ఫైల్స్ ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కూడా చెప్పుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అడిగిన అనేక సందర్భాలలోనూ అధికారులు ఇదే ధోరణి ప్రదర్శించారు. తట్టుకోలేక ముఖ్యమంత్రి వారికి స్థానచలనం కలిగించారు. వారంతా గులాబీ పార్టీకి అనుకూలమైన వ్యక్తులని.. అందువల్లే ఎవరి మాటా వినరని సెక్రటేరియట్ లో ప్రచారం జరుగుతుంటుంది. తాజాగా ఓ మంత్రికి ఐఏఎస్ అధికారి నుంచి దారుణమైన సమాధానం ఎదురయింది. ఒక రకంగా ఆయన పరువు కూడా పోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
తెలంగాణలో మలి దశ మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి లభించింది. ఆయన మంత్రి కావడం ఇదే తొలిసారి. సహజంగానే ఆయన ఉత్సాహంగా పనిచేస్తుంటారు. ఇటీవల కాలంలో తన శాఖకు సంబంధించిన కొన్ని ఫైల్స్ తన పేషి లో పనిచేస్తున్న సెక్రటరీకి పంపించారు. వాస్తవానికి వాటిపై వెంటనే సంతకాలు చేసి పంపించాల్సిన బాధ్యత సెక్రటరీ మీద ఉంటుంది. కానీ ఆ సెక్రెటరీ సీనియర్ ఐఏఎస్ అధికారి. పైగా గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వ పెద్దలతో ఆయన విపరీతంగా అంట కాగారు.. దీంతో అదే ధోరణి ఇప్పుడు కూడా సాగిస్తున్నారు.. రేవంత్ ప్రభుత్వం ఆ అధికారి పై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకుంటుందనే నమ్మకం కూడా లేదు. ఇక ఐఏఎస్ అధికారి కొత్త మంత్రి పంపించిన ఫైల్స్ మీద సంతకాలు పెట్టకపోగా.. సాక్షాత్తు మంత్రి ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.
“ఏ దస్త్రం ఎప్పుడు పూర్తి చేయాలో నాకు తెలుసు. మీరు అనుక్షణం నా పనికి ఇబ్బంది కలిగించదు. ఎప్పుడు పడితే మీరు అప్పుడు ఫోన్ చేస్తే కుదరదని” మంత్రికి చెప్పడంతో.. ఆయన ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తోంది. తన అనుచరులు.. కార్యకర్తల ముందు అలా మాట్లాడటంతో ఆ మంత్రి తలదించుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి మంత్రులు చెప్పిన పని అధికారులు చేయాలి. ఫైల్స్ మీద ఎప్పటికప్పుడు సంతకాలు పెట్టాలి. ఒకవేళ అందులో ఏవైనా లోపాలు ఉంటే మళ్ళీ పంపించాలి. అంతేతప్ప సంతకాలు పెట్టకుండా ఫైల్స్ రోజుల తరబడి పెండింగ్ ఉంచుకుంటే చాలా కష్టం. ఇదే విషయం ఆ ఆఫీసర్ కు కొత్త మంత్రి ఎన్ని సార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రత్యేకంగా ఫోన్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఆ మంత్రి సదరు అధికారి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది.