Maoists: మావోయిస్టు పార్టీకి ప్రధాన అడ్డాలుగా మారాయి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీ అటవీ ప్రాంతాలు. దేశమంతా మావోయిస్తు ప్రాబల్యం ఉన్నా.. ప్రభావం మాత్రం తెలంగాణ ఛతీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంది. ఛతీస్‌గఢ్‌లోని అంబూస్‌మడ్ అడవుల కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అప్పుడప్పుడు పేలుళ్లు, కాల్పులతో ఉనికిని చాటుకుంటున్నారు. అయితే మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రత్యేక దళాలు నిరంతరం అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు గుర్తించే క్రమంలో ఎన్‌కౌంటర్ జరుగుతున్నాయి. ఇక కొంతమందిని కోవర్టు ఆపరేషన్‌తో పట్టుకుని ఎన్‌కౌంటర్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వరుసగా మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మంగళవారం(సెప్టెంబర్ 3న) ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నటు తెలుస్తోంది. కొందరిని గుర్తించాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత (గురువారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 6 గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. భద్రాచలం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం ప్రాంత సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మృతుల్లో తెలంగాణకు చెందిన అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలియాల్సివుంది.
లచ్చన్న దళం సభ్యులుగా గుర్తింపు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారు లచ్చన్న దళం సభ్యులుగా చెబుతున్నారు. గ్రేహౌండ్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కాల్పుల అనంతరం చేపట్టిన గాలింపలో ఇద్దరు మావోయిస్టులు గాయాలతో పట్టుపడ్డారు. మృతదేహాలను, గాయపడ్డవారిని మణుగూరు ఆస్పత్రికి తరలించారు. రెండు ఏకే 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు ఖమ్మం, ములుగు, భద్రాద్రి జిల్లా అడవుల్లోకి వచ్చినట్లు అందిన సమాచారంతో గ్రేహౌండ్స్ ఆపరేషన్ నిర్వహించినట్లు సమాచారం.
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ వాసులు..
చత్తీస్ గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బైలడిల్లా అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య ప్రాంత ఇన్‌చార్జి మాచర్ల ఏసోబు (70) అలియాస్ జగన్, రణధీర్, దాదా చనిపోయారు. ఈ మేరకు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ ప్రకటన విడుదల చేశారు. ఎన్‌కౌంటర్‌లో మొత్తం 9 మంది చనిపోగా అందులో జగన్‌తోపాటు పీఎల్ జీఏ సభ్యురాలు శాంతి, ఏరియా కమిటీ మెంబర్లు మడకం సుశీల, గంగి ముచికీ, కోసా మడవి, డివిజన్ కమిటీ సభ్యులు లలిత, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ గార్డు కవిత, డివిజన్ కమిటీ సభ్యుడు హిడ్మే మడకాం, ప్లాటూన్ సభ్యుడు కమలేశ్ ఉన్నట్లు ఐజీ తెలిపారు.
9 మందిపై రూ.60 లక్షల రివార్డు..
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన 9 మందిపై రూ.60 లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ తెలిపారు. ఇందులో జగన్ ఒక్కడిపైనే రూ. 25 లక్షల రివార్డు ఉందన్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో రెండు 303 రైఫిల్స్, రెండు 12 బోర్ రైఫిల్స్, రెండు బర్మార్ బందూకులు, ఎస్‌ఎల్‌ఆఆర్, దేశీయ కార్బన్ 9ఎంఎం, 8 ఎంఎఎం రైఫిల్, 315 బోర్ రైఫిల్, బీజీఎల్ లాంచర్ తో పాటు భారీగా పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.
జగన్ సొంతూరు టేకులగూడెం
మావోయిస్ట్ నేత మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ చనిపోవడంతో అతడి సొంతూరు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులవారిగూడెం. 1974లో 21 ఏండ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. 1978లో రైతు కూలీ సంఘం అధ్యక్షుడిగా పని చేసిన ఏసోబు తర్వాత పూర్తిగా అడవులకే అంకితం అయ్యాడు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో కీలకంగా ఎదిగి, పార్టీ అగ్రనేతలైన కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతికి స్పెషల్ ప్రొటెక్షన్ వింగ్ కమాండర్గా పనిచేశాడు. ఆ తర్వాత కేంద్ర కమిటీ మిలిటరీ సభ్యుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కమిటీ మిలిటరీ ఇన్‌చార్జిగా, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్ బార్డర్ ఇన్‌చార్జిగా కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.