Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రాణించడం అంత సులభం కాదు. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. అలాగే ఎత్తుకు పైఎత్తులు వేయాలి. ఒక్క చిన్న మాట, చర్య కూడా గేమ్ నాశనం చేయవచ్చు. ఆడియన్స్ లో నెగిటివిటీ వస్తే హౌస్లో మనుగడ ఉండదు. ఓట్లు పడవు. భారీ అంచనాల మధ్య హౌస్లో అడుగుపెట్టిన టాప్ సెలెబ్స్ సైతం బోల్తా పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే సామాన్యుడు పల్లవి ప్రశాంత్ చాలా తెలివిగా గేమ్ ఆడుతూ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
పల్లవి ప్రశాంత్ అణకువగా ఉండేవాడు. ఎవరైనా గట్టిగా టార్గెట్ చేస్తే ఏడ్చేవాడు. పల్లెటూరి నుండి వచ్చాడన్న ఓ సింపతీ అతడికి బాగా వర్క్ అవుట్ అయ్యింది. అమర్ దీప్ తో పాటు కొందరు కంటెస్టెంట్స్ అతడు సింపతీ కార్డు వాడుతున్నాడని నిరూపించే ప్రయత్నం చేశారు. పల్లవి ప్రశాంత్ జోలికి వెళ్లిన వారందరు నెగిటివ్ అయ్యారు. దాంతో ఒక దశలో అతన్ని టార్గెట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
ప్రైజ్ మనీ పేదలకు పంచుతానని చెప్పి మరో బలమైన అస్త్రం వదిలాడు. వీటితో పాటు ఫిజికల్ టాస్క్ లలో రాణించడం పల్లవి ప్రశాంత్ కి ప్లస్ అయ్యింది. టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ గెలిచాడు. ఇటీవల మొదలైన సీజన్ 8లో ఇదే తరహా గేమ్ తో నాగ మణికంఠ హైలెట్ అవుతున్నాడు. అతడి ప్రతి మాటలో ఎమోషన్ ఉండేలా చూసుకుంటున్నాడు. తాను తల్లిదండ్రులు లేని పిల్లాడిని అని నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు.
నామినేషన్స్ లో శేఖర్ బాషా తో వాగ్వాదం జరిగింది. వెంటనే తన కన్నీటి గాథ స్టార్ట్ చేశాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే తల్లి వేరే పెళ్లి చేసుకుంది. సవతి తండ్రి అవమానించాడు. బాధలకు గురి చేశాడన్నాడు. తల్లి చనిపోతే కట్టెలకు డబ్బులు లేక అడుక్కున్నానని.. బోరున ఏడ్చాడు. నాగ మణికంఠ మాటలకు ఇతర కంటెస్టెంట్స్ కన్నీరు పెట్టుకోవడం విశేషం.
నామినేషన్స్ అనంతరం కూడా విగ్గు తీసేసి తన నిజ స్వరూపం చూపిస్తూ ఏడ్చాడు. ఇంత కంటే నాకు ట్రాన్స్పరెంట్ గా ఉండటం తెలియదని విలపించాడు. ఇక కన్ఫెషన్ రూమ్ లో భారీ డ్రామాకు తెరలేపాడు. నాకు భార్య, కూతురు కావాలి. అత్తమామల నుండి రెస్పెక్ట్ కావాలి. స్టెప్ ఫాదర్ మనీ కావాలి. బయటకు వెళ్ళాక నాకు జీవితం ఉందో లేదో… అంటూ గట్టిగా ఏడ్చేశాడు. ప్రతిసారి ఏడుస్తూ సింపతీ పొందే పనిలో ఉంటున్న నాగ మణికంఠను మరో పల్లవి ప్రశాంత్ అంటున్నారు.