Khammam: దేశానికే తెలంగాణ ఆదర్శమని కేసీఆర్ చెప్తుంటాడు. “ఏమోయ్ మోదీ నీవల్ల ఏది కావడం లేదు. అర్జెంటుగా సీటు దిగి పో. నేను గద్దెనెక్కి చక్రాలు తిప్పుతా అని” సవాల్ విసురుతాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో మాత్రం పట్టించుకోడు. అసలే అది అటవీ ప్రాంతం. ఆ ఊరి పేరు కొత్త మేడేపల్లి. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ఉంటుంది. ఈ గ్రామానికి చత్తీస్గడ్ నుంచి చాలా సంవత్సరాల క్రితం గిరిజనులు వలస వచ్చారు. ఇక్కడే చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు గట్రా ఉన్నాయి. అయినప్పటికీ ఈ గ్రామానికి రోడ్డు లేదు. అరచేతిలో ప్రపంచం ఇమిడిపోతున్న ఈ రోజుల్లో కరెంటు సౌకర్యం లేదు. వర్షాలు వస్తే దేవుడి మీద భారం వేసి బతకడమే. ఇక ఏదైనా అనారోగ్యానికి గురైతే అంతే సంగతులు. 2018లో ఇక్కడి ప్రజల ఓట్ల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ అప్పటికప్పుడు పింఛన్లు మంజూరు చేసింది. ఈ 8 సంవత్సరాలలో టిఆర్ఎస్ పదే పదే చెబుతున్న బంగారు తెలంగాణ ఆనవాళ్లు ఇక్కడ అంజనం వేసి వెతికినా కనిపించవు.

కూతురి మృతదేహంతో బైక్ పై 60 కిలోమీటర్లు
మీ బిడ్డ ఇక లేదని వైద్యులు చెప్పినప్పుడు ఆ దంపతులకు గుండెల్లో చెప్పలేని బాధ.. కంటికి దారగా విలపిస్తూనే ఆ దుఃఖాన్ని దిగమింగుకొని చేతిలో ఉన్న 50 రూపాయలతో కూతురి మృతదేహాన్ని చేతిలోకి తీసుకొని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు.. 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ ఇంటికి మృతదేహాన్ని తరలించేందుకు ఆ బడుగు జీవులు పడ్డ కష్టం తెలిస్తే మనసు ఉన్న ఎవరికైనా కూడా కళ్ళు చమర్చక మానవు. అంబులెన్స్ వాహనం లేదని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చెప్పడం.. ప్రైవేటు వాహనానికి మూడు వేలు ఇచ్చుకునే స్థోమత లేకపోవడం.. దాన్ని బంధువులకు చెబుదామనుకున్నా ఫోన్ లేకపోవడంతో.. బైక్ పై మృతదేహాన్ని తరలించాలి అనుకున్నారు. పాప బాబాయ్ బైక్ తోలుతుంటే తల్లిదండ్రులు వెనుక కూర్చొని మధ్యలో మృత దేహాన్ని పెట్టుకున్నారు. 60 కిలోమీటర్లు ప్రయాణించి స్వగ్రామం చేరుకున్నారు.
ఇదీ జరిగింది
కొత్తమేడేపల్లికి చెందిన వెట్టి మల్లయ్, అది అనే గిరిజన దంపతులు 20 సంవత్సరాల క్రితం చత్తీస్గడ్ నుంచి ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలోని కొత్త మేడేపల్లికి వచ్చారు. ఇక్కడే కష్టం చేసుకుని బతుకుతున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. మూడేళ్ల కూతురు సుక్కికి జ్వరం ఆపై ఫిట్స్ రావడంతో శనివారం సాయంత్రం ఏన్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు.. పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడ వైద్యులు సూచించారు. చేతిలో ఉన్న ₹200 తో బస్సు ఎక్కారు. రాత్రి 7 గంటలకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.. పాపను పరీక్షించిన అక్కడ వైద్యులు పెదవి విరిచారు. చిన్నారిని వరంగల్ లేదా హైదరాబాద్ తీసుకెళ్లాలని చెబుతూనే వైద్యం ప్రారంభించారు. ఆ క్రమంలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసింది. కన్నీరు మున్నిరైన తల్లిదండ్రులు సుక్కి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చేందుకు ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించారు.. వారు అంబులెన్స్ లేదని చెప్పడంతో ప్రైవేట్ అంబులెన్సు వారిని సంప్రదిస్తే ₹3000 అడిగారు. అంత డబ్బు లేకపోవడంతో మల్లాయ్ ఆ పాప మృదేహాన్ని భార్య చేతిలో నుంచి తీసుకొని బస్సు ఎక్కాడు. గార్ల ఒడ్డుకు చేరుకున్నాడు. జయరాం అనే బాల వెలుగు ఉద్యోగి ద్వారా తమ గ్రామ పెద్ద అయిన గంగరాజుకు ఫోన్ చేయించి జరిగిన విషయం చెప్పాడు.. గంగరాజు వెంటనే మల్లయ్ సోదరుడికి ఒక బైక్ ఇచ్చి పంపాడు.. అతడు ఖమ్మం వెళ్లి వదిన అయిన ఆదిని వెంటబెట్టుకొని వచ్చాడు. గార్లోడ్డు నుంచి బైక్ పై ముగ్గురు మృతదేహాన్ని వెంటబెట్టుకుని 60 కిలోమీటర్లు ప్రయాణించి కొత్త మేడేపల్లి చేరుకున్నారు. ఆస్తులు ఇంటింటికి వంద చొప్పున చందాలు వేసుకొని అంత్యక్రియలు జరిపించారు. కాగా మృతదేహాలను తరలించేందుకు పార్దివ వాహనాల సౌకర్యం ఉన్నప్పటికీ గిరిజన కుటుంబానికి ఉపయోగపడకపోవడంపై ఖమ్మం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుని వివరణ కోరితే ఆయన మరో రకంగా స్పందించారు.. సమస్యను మాకు చెప్పలేదని, చెబితే పార్దివ వాహనాన్ని సమకూర్చే వాళ్ళమని ఆయన వివరించారు.

కోట్లు ఖర్చు చేసినా ఉపయోగం లేదు
మునుగోడు ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు వందల కోట్లు ఖర్చు పెట్టాయి.. వాటిల్లో ఒక వంతు ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఖమ్మం లాంటి నగరాల్లో పార్థివ వాహనాల కొరత ఉందంటే ఇక మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేటికీ కూడా సరైన సమయానికి అంబులెన్స్ రాక పోతున్న ప్రాణాలు ఎన్నో.. అంబులెన్స్ లకు సకాలంలో మరమ్మతులు నిర్వహించగా అవి అత్యవసర సమయంలో మోరాయిస్తున్నాయి. ఇక మొన్న భద్రాద్రి జిల్లాలోని బూర్గంపాడు లో అంబులెన్స్ సకాలంలో వెళ్లకపోవడంతో ఓ వ్యక్తి విషమ స్థితిలోకి వెళ్లిపోయాడు.. ఇలా చెప్పుకుంటూ పోవాలి గాని బంగారు తెలంగాణలో ఎన్నో దీన గాథలు. ఇవి వెలుగులోకి రావు. వచ్చినా వాటిని టాకిల్ చేసేందుకు బీటీ బ్యాచ్ ఉంటుంది. “కెసిఆర్ సార్.. గుజరాత్ ఎన్నికల ప్రచారం కంటే ముందు ఇలాంటి వాటిపై దృష్టి సారించండి. ముందు మన ఇంటిని బాగు చేసుకుందాం. ఆ తర్వాతే ఢిల్లీలో చక్రాలు తిప్పుదాం”! ఏమంటారు?!