Mobile Phone Tips: ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం మాట్లాడుకునేందుకు మాత్రమే.. కానీ ఇప్పుడు సమస్తం అందులోనే.. సమస్తం దాని ద్వారానే. మాటలు, ఆటలు, పాటలు, సినిమాలు, బ్యాంకింగ్, నావిగేషన్.. ఇలా ప్రతీ ఒక్కటి ఫోన్ ద్వారానే జరుగుతున్నది. ఫోన్ ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయి. అపరిచిత వ్యక్తులు మెసేజ్, లింక్ లు పంపించి.. ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం ఊడ్చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువైపోయాయి. ఈ తరహా సంఘటనలలో డబ్బులు రికవరీ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారుతుంది. ఇవే ఇలా ఉన్నాయంటే.. మరో ఉపద్రవం ముంచుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లు అలాంటి తప్పు చేయద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలామంది ఫోన్ల ద్వారా సోషల్ మీడియా అకౌంట్లు ఆపరేట్ చేస్తుంటారు.. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఎక్స్ వంటి సోషల్ మీడియా ఎకౌంట్ లలో లాగిన్ అయ్యేటప్పుడు పాస్ వర్డ్ లు, ఇతర వివరాలను ఆటో ఫిల్ ఆప్షన్ కు ఓకే చేస్తుంటారు. అయితే ఇది మంచిది కాదని.. దీనివల్ల ఆపరేటర్ సిస్టం లోని పాస్ వర్డ్ ల సామర్థ్యం తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు కూడా అత్యంత సులభంగా దాడి చేస్తారని ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్ అంకిత్ గంగవాల్ చెబుతున్నారు. ఆయన ఇటీవల దీనిపై పరిశోధన చేశారు. అందుకే సొంతంగా పాస్ వర్డ్ టైప్ చేయాలని సూచిస్తున్నారు..” ఫోన్ల వినియోగం పెరిగింది. ప్రతీ చిన్న విషయానికి ఫోన్ మీద ఆధారపడటం పెరిగిపోయింది. అలాంటప్పుడు ఫోన్ వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పాస్ వర్డ్ లను చాకచక్యంగా ఎంపిక చేసుకోవాలి. లేకుంటే ఇబ్బంది పడాల్సి ఉంటుందని” అంకిత్ గంగవాల్ ప్రకటించారు.
ఫోన్ లోని ఆపరేటింగ్ సిస్టం పాస్వర్డ్ మేనేజర్ సామర్థ్యం తగ్గిపోకూడదు. దీనివల్ల ఫోన్లపై సైబర్ నేరగాళ్లు దాడి చేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించడం, ఖాతాల్లో డబ్బులు లాగడం వంటి దారుణాలకు పాల్పడతారు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే కచ్చితంగా పాస్ వర్డ్ టైప్ చేయాల్సిందే. ఫోన్ సామర్థ్యం ఎంత బాగుంటే.. మన ఇతర వ్యవహారాలు అంత బాగుంటాయి. అలాకాకుండా ఆపరేటింగ్ సిస్టం పాస్ వర్డ్ మేనేజర్ల సామర్థ్యం తగ్గించే చర్యలకు పాల్పడితే.. తదుపరి పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి అత్యయిక పరిస్థితుల్లో సైబర్ పోలీసులకు కూడా ఒక్కోసారి నిందితులను పట్టుకోవడం కష్టమవుతుంది.