WhatsApp: మన దేశంలోని ప్రజలు ఎక్కువగా ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో వాట్సాప్ యాప్ గురించి సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఆ వార్తలను చాలామంది నిజమేనని నమ్ముతుండటం గమనార్హం. కొన్నిరోజుల క్రితం సాంకేతిక కారణాల వల్ల వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ కొన్ని గంటల పాటు పని చేయలేదు.

ఆ సమయంలో వాట్సాప్, ఫేస్ బుక్ నిలిచిపోవడానికి ఇవే కారణాలంటూ అనేక ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ ను రాత్రి 11.30 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిలిపివేయనుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రాత్రి సమయంలో కూడా వాట్సాప్ పని చేయాలంటే వాట్సాప్ యూజర్లు నెలవారీ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.
సోషల్ మీడియాలో ఈ వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ వార్తల గురించి స్పందించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ద్వారా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధపు ప్రచారమని వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వదంతులను నమ్మవద్దని కేంద్రం సూచనలు చేయడం గమనార్హం.
వాట్సాప్ యాప్ ను వినియోగించే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఫేక్ వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఇతరులకు మెసేజ్ లను ఫార్వర్డ్ చేసే సమయంలో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకుని ఫార్వర్డ్ చేస్తే మంచిది. ఫేక్ వార్తలను వైరల్ చేసేవాళ్లు భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.