Toyota Land Cruiser 300: టయోటా కంపెనీ మార్కెట్లోకి తన కొత్త ల్యాండ్ క్రూయిజర్ 300 హైబ్రిడ్‌ను రిలీజ్ చేసింది. ఇది ఇప్పటివరకు వచ్చిన ల్యాండ్ క్రూయిజర్ మోడల్స్‌లోకెల్లా అత్యంత పవర్ఫుల్ వెహికల్. తన పవర్ఫుల్ ఆఫ్-రోడింగ్ కెపాసిటీకి పేరుపొందిన ల్యాండ్ క్రూయిజర్ ఇప్పుడు కొత్త హైబ్రిడ్ వెర్షన్‌తో వచ్చింది. కొత్త ల్యాండ్ క్రూయిజర్ 300 హైబ్రిడ్ బయట చూడటానికి పెద్దగా మారలేదు. కానీ, దాని ఇంజిన్‌లో, టెక్నాలజీలో మాత్రం చాలా పెద్ద అప్డేట్ చేశారు. ఎక్కువ పవర్, మంచి మైలేజ్ ఇచ్చే సిస్టమ్‌ని టయోటా ఇందులో పెట్టింది. ఈ అదిరిపోయే SUVని కంపెనీ ముందుగా ఆస్ట్రేలియాలో లాంచ్ చేయనుంది. కానీ, భవిష్యత్తులో మన భారత్‌తో సహా ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఇందులో ఉన్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కారుకి ఎక్కువ పవర్ ఇచ్చే హైబ్రిడ్ 3.5-లీటర్ ట్విన్-టర్బో V6 పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్‌కు ఒక ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ కూడా కలిపి ఉంటాయి. ఈ ఇంజిన్ ఏకంగా 451 బీహెచ్పీ పవర్, 790 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది పాత 3.3-లీటర్ డీజిల్ ఇంజిన్ (304 బీహెచ్పీ, 700 ఎన్ఎమ్) కంటే చాలా చాలా పవర్ఫుల్. అంతేకాదు, పవర్ డెలివరీ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది. దీనికి 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. ప్రతీ ల్యాండ్ క్రూయిజర్ స్పెషాలిటీ అయిన 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) సిస్టమ్ కూడా ఇందులో ఉంది.
హైబ్రిడ్ ఇంజిన్ వల్ల లాభాలేంటి?
ఇందులో వాడిన హైబ్రిడ్ సిస్టమ్ లెక్సస్ ఎల్ఎక్స్ 700హెచ్ లో కూడా ఉంది. ఎందుకంటే, ఆ కారు కూడా ల్యాండ్ క్రూయిజర్ 300 ప్లాట్‌ఫామ్‌పైనే తయారవుతుంది. ఈ హైబ్రిడ్ సిస్టమ్ కారును పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో నడపడానికి వీలు కల్పించదు. కానీ, ఇంజిన్ పవర్‌ను పెంచడంలో మాత్రం బాగా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుంది. మైలేజ్ పెరుగుతుంది. ఇంకా కార్బన్ డయాక్సైడ్ పొగ కూడా తక్కువ వస్తుంది. అధికారిక మైలేజ్ వివరాలు ఇంకా చెప్పలేదు కానీ, డీజిల్ వెర్షన్ కంటే ఇది బెటర్ మైలేజ్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
Also Read: Toyota HiAce : పెద్ద ఫ్యామిలీకి ఒకే ఒక్క బస్సు.. హైఏస్ ఉంటే మీ ట్రిప్ సూపర్ హిట్!
ఈ ల్యాండ్ క్రూయిజర్ 300 హైబ్రిడ్ ఇండియాకు వస్తుందా?
కారు లోపలి డిజైన్ దాదాపు అలాగే ఉంది కానీ, కొన్ని అప్డేట్స్ చేశారు. ఇప్పుడు 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్టాండర్డ్‌గా వస్తుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో బ్యాటరీ లెవెల్, పవర్ ఫ్లో లాంటి హైబ్రిడ్ స్పెసిఫిక్ సమాచారం కనిపిస్తుంది. ప్రస్తుతానికి టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 హైబ్రిడ్‌ను ఇండియాలో లాంచ్ చేస్తామని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే, ఇండియాలో డీజిల్ వాహనాలపై రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండడం ముఖ్యంగా ఢిల్లీ-ఎన్సీఆర్ లాంటి ప్రాంతాల్లో 10 ఏళ్ల తర్వాత డీజిల్ కార్లపై బ్యాన్ ఉండటం చూస్తే, టయోటా ఈ హైబ్రిడ్ వెర్షన్‌ను ఇండియాకు తీసుకురావచ్చు అని అనుకుంటున్నారు.