https://oktelugu.com/

Sunita Williams: అంతరిక్షంలో ఇరుక్కుపోయిన సునీత.. తిరిగి వచ్చే తేదీ కూడా తెలియదు

వాణిజ్య కార్యక్రమం లో భాగంగా నాసా ఇచ్చిన ఆర్డర్ ప్రకారం బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసింది. ఆ వ్యోమ నౌకకు ఇదే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 28, 2024 / 10:28 AM IST

    Sunita Williams

    Follow us on

    Sunita Williams: బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి విల్ మోర్.. తిరిగి భూమ్మీదకి వచ్చే విషయంలో సందిగ్ధత ఏర్పడింది. ఈనెల 5న పది రోజుల మిషన్ లో భాగంగా సునీత, విల్ మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 14న వారు భూమి మీదకి తిరిగి రావాలి. వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హీలియం లీక్ కావడంతో వారి ప్రయాణం అక్కడే నిలిచిపోయింది. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (NASA) ఒక షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 26న వారు తిరుగు ప్రయాణమవుతారని ప్రకటించింది. కానీ వారి ల్యాండింగ్ మరోసారి వాయిదా పడింది.. అయితే వారు ఎప్పుడూ తిరిగి భూమి మీదకి వస్తారనే విషయంపై నాసా ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు.. జూన్ 14నే వారు తిరిగి భూమ్మీదకు రావాల్సి ఉంది. దానిని 12 రోజులు పొడిగిస్తూ జూన్ 26 కు మార్చింది నాసా.. పది రోజుల మిషన్ కాస్తా 23 రోజులకు చేరుకుంది.. ఇన్ని రోజులవుతున్నప్పటికీ.. వారు తిరిగి భూమిని ఎప్పుడు చేరుకుంటారనేది స్పష్టత లేదు.

    వాణిజ్య కార్యక్రమం లో భాగంగా నాసా ఇచ్చిన ఆర్డర్ ప్రకారం బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ తయారు చేసింది. ఆ వ్యోమ నౌకకు ఇదే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ వెళ్లేందుకు ముందుగా నిర్వహించిన ప్రయోగాలలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. హీలియం పలుమార్లు లీకేజ్ కి గురైంది. అంతేకాదు గైడెన్స్ – కంట్రోల్ థ్రస్టర్ లలో లోపం తలెత్తింది. దీంతో పలుమార్లు ప్రయోగం వాయిదా పడింది. వాయిదా పడిన అనంతరం.. చివరిగా జూన్ 5న సునీతా విలియమ్స్, విల్ మోర్ ను అంతరిక్షంలోకి పంపించారు. అయితే వారు తిరిగి భూమి మీదకు వచ్చేందుకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూలై రెండున వారిద్దరు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు అనుసంధానమైన స్టార్ లైనర్ వ్యోమ నౌకలో హీలియం లీక్ అవుతున్నట్టు బోయింగ్, నాసా సంస్థలు గుర్తించాయి. ఫలితంగా స్టార్ లైనర్ లో సునీత, విల్ మోర్ తిరిగి భూమి మీదకు రావడానికి ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

    మరోవైపు టెస్లా చీఫ్ ఎలా మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ వ్యోమ నౌక క్రూ డ్రాగన్ లో సునీతను భూమ్మీదికి తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు నాసా అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ ఏడాది మార్చి నెలలో నలుగురు వ్యోమగాములను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు క్రూ డ్రాగన్ తీసుకెళ్ళింది. వారిని సురక్షితంగా భూమ్మీదకి తీసుకువచ్చేందుకు అంతరిక్షంలో సిద్ధంగా ఉంది. ఆ క్రూ డ్రాగన్ లో ఇద్దరు లేదా నలుగురు లేదా మరింత మందిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది. ఒకవేళ నిర్ణీత సమయంలోపు స్టార్ లైనర్లో మరమ్మతులు పూర్తికాకుంటే మస్క్ క్రూ డ్రాగన్ లో సునీత, విల్ మోర్ తిరిగి భూమ్మీదకి వచ్చే అవకాశం లేకపోలేదు.

    సునీతా విలియమ్స్ కు ఇది మూడవ అంతరిక్ష యాత్ర. 1998లో ఆమెను నాసాకు ఎంపికయ్యారు. 2006లో తొలిసారిగా రోదసి యాత్ర చేశారు. ఆ తర్వాత 2012లో మరోసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ సమయంలో మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు ఆమె స్పేస్ వాక్ చేశారు. 322 రోజులపాటు అంతరిక్షంలో గడిపారు. ఒకసారి స్పేస్ లో మారథాన్ కూడా చేశారు. నాసా చెబుతున్నట్టు అన్ని అనుకూలంగా ఉంటే జూలై రెండున సునీత, విల్ మోర్ భూమ్మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.