Russia India Relations: అమెరికా ఆంక్షలు విధిస్తే.. భారత్ తలదించుకొని చూసే రోజులు కావివి..

గత కొన్ని సంవత్సరాలుగా భారత్ తన విద్యుత్ అవసరాలకు సరిపడిన విధంగా బొగ్గు లభించక ఇబ్బంది పడుతోంది. దేశంలో విస్తారంగా బొగ్గు గనులు ఉన్నప్పటికీ.. నాణ్యమైన బొగ్గు లభించక నానా తిప్పలు పడుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 28, 2024 10:36 am

Russia India Relations

Follow us on

Russia India Relations: అమెరికా.. ప్రపంచ పెద్దన్న. ఆ దేశం కన్నెర్ర చేస్తే చాలు ప్రపంచ దేశాలు వణికి పోతాయి. అమెరికాతో ఎందుకు గోక్కోవడం అంటూ భయపడిపోతుంటాయి.. అందుకే అమెరికాకు నచ్చిన పనులు మాత్రమే చేసుకుంటూ వెళ్తాయి. అందువల్లే అమెరికా ప్రపంచంపై పెత్తనం చెలాయిస్తోంది.. చైనా వంటి దేశాలకు ఇది నచ్చకపోయినప్పటికీ.. వాటి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా.. అవసరాల దృష్ట్యా.. ఏమీ అనలేని పరిస్థితి. ఈ పరిణామాలు ఇలా సాగుతుండగానే.. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది.. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చివరికి రష్యాకు కూడా తెలియదు. ఉక్రెయిన్ పై యుద్ధం అటు యూరప్, ఇటు అమెరికాకు సుతారం ఇష్టం లేదు. అందువల్లే అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది.. యూరప్ దేశాలు కూడా దీనికి వంత పాడాయి. రష్యా నుంచి గ్యాస్, ముడి చమురు, బొగ్గు దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాయి. ప్రపంచ దేశాలు కూడా ఇదే విధానాన్ని పాటించాలని స్పష్టం చేశాయి.. అమెరికా – యూరప్ దేశాలు విధించిన నిబంధనలను దాదాపు అన్ని దేశాలు పాటిస్తున్నాయి. ఇందులో భారత్ ఉన్నప్పటికీ.. అమెరికా విధించిన ఆంక్షలు నేరుగా ప్రశ్నించకుండా.. తన అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చుకుంటున్నది.. తన చాకచక్యంతో అమెరికాను కూడా ఏమీ చేయలేని పరిస్థితిలోకి నెట్టింది.

సరికొత్త వాణిజ్యానికి బాటలు

గత కొన్ని సంవత్సరాలుగా భారత్ తన విద్యుత్ అవసరాలకు సరిపడిన విధంగా బొగ్గు లభించక ఇబ్బంది పడుతోంది. దేశంలో విస్తారంగా బొగ్గు గనులు ఉన్నప్పటికీ.. నాణ్యమైన బొగ్గు లభించక నానా తిప్పలు పడుతోంది. రష్యాలో లభించే బొగ్గు చాలా నాణ్యంగా ఉంటుంది. అక్కడి నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటే అమెరికా ఆంక్షలు ఉన్నాయి. అలాంటప్పుడు అమెరికాతో నేరుగా సవాల్ చేసే పరిస్థితి భారత్ కు లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నాలుగవ ఆర్థిక వ్యవస్థ నుంచి మూడవ ఆర్థిక వ్యవస్థ దాకా ఎదిగేందుకు భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో తగువు పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టే అవుతుంది. మన విద్యుత్ అవసరాలకు రష్యా బొగ్గు కావాలి. ఇదే సమయంలో అమెరికా ఆగ్రహానికి గురికాకుండా ఉండాలి. ఈ నేపథ్యంలో అటు రష్యా, ఇటు భారత్ చేసిన ఆలోచన సరికొత్త వాణిజ్యానికి బాటలు వేశాయి. ఇది ప్రస్తుతం ప్రపంచ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రష్యా నుంచి తొలిసారిగా రెండు బొగ్గు రైళ్ళు

రష్యా సగం ఆసియాలో, సగం యూరప్ లో ఉంటుంది. భౌగోళికంగా ఆ దేశానికి అనేక వనరులు, రవాణా వ్యవస్థలు ఉన్నాయి.. తాను ఉత్పత్తి చేస్తున్న బొగ్గును రవాణా చేసేందుకు రష్యా 2000 సంవత్సరంలో international north south transport corridor (INSTC) ని ప్రారంభించింది. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే ఊహించి రష్యా ఈ ట్రాన్స్ పోర్ట్ కారిడార్ ను ప్రారంభించింది. ఈ కారిడార్ ద్వారా బొగ్గుతో కూడిన రెండు రైళ్లను రష్యా మొట్టమొదటిసారిగా భారత్ కు పంపించింది.. సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి భారత్ లోని ముంబై ఓడరేవు కు 7,200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా ఈ కొత్త రవాణా మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలకు కూడా బొగ్గు, చమురు రవాణాకు ఈ మార్గాలనే రష్యా ఉపయోగించుకోవాల్సి వస్తోంది. రష్యా వెలుగులోకి తెచ్చిన ఈ మార్గాన్ని భారత్ తెగ ప్రచారం చేస్తోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కు ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుందని భారత్ పలు వేదికల్లో స్పష్టం చేసింది.

చౌక ధరకు కొనుగోలు

“మొదటిసారి కుజ్ బాస్ బొగ్గుతో రెండు రైళ్లు అంతర్జాతీయ ఉత్తర – దక్షిణ రవాణా కారిడార్ ద్వారా భారతదేశానికి బయలుదేరాయి. కెమెరోవో గనుల్లో వెలికి తీసిన బొగ్గు ఈ రైళ్లల్లో నింపాం. ఈ రైళ్లు INSTC తూర్పు భాగంలో ఉన్న కజకిస్తాన్, తుర్కిమెనిస్తాన్ మీదుగా ఇరాన్ పోర్ట్ ఆఫ్ బందర్ అబ్బాస్ వరకు వెళ్తాయి.. ఇరాన్ లోని బందర్ అబ్బాస్ ఓడరేవు నుంచి బొగ్గు భారత్ లోని ముంబైలోని నౌకాశ్రయానికి చేరుకుంటుందని” రష్యన్ రైల్వే తన టెలిగ్రామ్ ఛానల్లో పేర్కొంది. అయితే అమెరికా విధించిన ఆంక్షల్లో రష్యా నుంచి నేరుగా వాణిజ్య లావాదేవీలు కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కానీ భారత్ చాలా తెలివిగా రష్యా నుంచి బొగ్గును ఇరాన్ కు తీసుకొచ్చి, అక్కడి నుంచి ముంబై నౌకాశ్రయానికి దిగుమతి చేసుకుంటున్నది. ఆ మధ్య ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకున్నప్పుడు దేశంలో ఉన్న ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెక్ పెట్టి.. రష్యా నుంచి భారత్ బొగ్గును దిగుమతి చేసుకుంటున్నది. అదికూడా చౌక ధరకే. అన్నట్టు దేశీయ ఇంధన అవసరాలకు రష్యా నుంచి భారత్ చౌక ధరకే ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నది.