Sunita Williams: గగన వీధిలోనూ సునీతా విలియమ్స్ దీపావళి వేడుకలు.. తన చిన్ననాటి రోజుల్ని ఎలా గుర్తు చేసుకున్నారంటే?

"ఏ దేశమేగినా.. ఎందుకు కాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవం" చిన్నప్పుడు చదువుకున్నాం కదా! దీనిని నిజం చేసి చూపించింది భారత సంతతి మహిళ సునీతా విలియమ్స్.

Written By: Anabothula Bhaskar, Updated On : November 1, 2024 8:49 am

Sunita Williams

Follow us on

Sunita Williams: సునీతా విలియమ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె తల్లిదండ్రులు చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయారు. దీంతో ఆమె విద్యాభ్యాసం ఇతర వ్యవహారాలు మొత్తం అమెరికాలోనే జరిగాయి. ఆ తర్వాత ఆమె ఆస్ట్రోనాట్ అయింది. నాసా లో పనిచేస్తోంది. గతంలో చాలా సందర్భాల్లో వివిధ ప్రయోగాల నిమిత్తం ఆమె అంతరిక్షం లోకి వెళ్ళింది. విజయవంతంగా తనకు అప్పజెప్పిన ఆపరేషన్లను పూర్తి చేసింది. ప్రస్తుతం కూడా ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో ఉంది. వాస్తవానికి ఎప్పుడో భూమికి తిరిగి రావలసి ఉన్నప్పటికీ.. బోయింగ్ సంస్థ క్యాప్సూల్ లో ఏర్పడిన సాంకేతిక అవరోధం వల్ల అక్కడే ఉండాల్సి వస్తోంది. అయితే అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పటికీ సునీతా విలియమ్స్ తన సంస్కృతిని మర్చిపోలేదు. సంప్రదాయాన్ని విడిచి పెట్టలేదు. ఆమె అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పటికీ దీపాలు వేడుకలు జరుపుకున్నారు. అంతేకాదు అక్కడి నుంచి శుభాకాంక్షలు తెలియజేశారు. దానికి సంబంధించిన వీడియో సందేశాన్ని ఆమె షేర్ చేశారు.

అరుదైన సందర్భం

అంతరిక్ష కేంద్రంలో దీపావళి వేడుకలు జరుపుకోవడం అర్థమైన విషయమని ఆమె పేర్కొన్నారు. అంతరిక్ష కేంద్రంలో ఆమె దీపావళి వేడుకలు జరుపుకున్న దృశ్యాలను అమెరికా అధ్యక్ష కార్యాలయంలో ప్లే చేశారు. ఈ సందర్భంగా భారత సంతతి ప్రజలు అమెరికా అభివృద్ధిలో పోషిస్తున్న పాత్రను సునీత విలియమ్స్ గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడన్, ఉపాధ్యక్షురాలు కమలహరిస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ” భారత సంస్కృతి గొప్పదనాన్ని గుర్తించారు. మీకు నా ధన్యవాదాలు. ఈసారి అంతరిక్షంలో నాకు పండుగ జరుపుకునే అరుదైన అవకాశం లభించింది. నా తండ్రి తన భారతీయ సంస్కృతిని వచ్చే తరానికి అందించేందుకు తపనపడ్డారు. నా చిన్నతనంలో భారతీయ పండుగల గొప్పతనాన్ని, వాటి వెనుక ఉన్న చారిత్రాత్మక ఐతిహ్యాన్ని వివరించారు.. దీపావళి పండుగ వెలుగులతో కనిపిస్తుంది. అది మానవాళి భవిష్యత్తుకు కాంతిని అందిస్తుందని” సునీత పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది జూన్ లో సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్లారు. అప్పటినుంచి ఆమె అక్కడే ఉండాల్సి వస్తోంది. వాస్తవానికి ఆమె వారం రోజుల్లోనే తిరిగి భూమికి రావాల్సి ఉండేది.. బోయింగ్ క్యాప్సూల్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఇది వ్యోమగాముల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని భావించి.. నాసా వారి తిరుగు ప్రయాణాన్ని నిలిపివేసింది. ఫలితంగా ఆమె అక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే వారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమ్మీదకి తిరిగి వస్తానని నాసా చెబుతోంది. అయితే ఈసారి బోయింగ్ కాకుండా, ఎక్స్ క్యాప్సూల్ ద్వారా వారిని భూమ్మీదకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది.

భారత సంతతి వ్యక్తులతో దీపావళి వేడుకలు

అమెరికా అధ్యక్షుడు బైడన్ భారత సంతతి వారిలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. వైట్ హౌస్ లో నిర్వహించిన ఈ సంబరాలలో ఆయన పాల్గొన్నారు. ముందుగా దీపాన్ని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. దీపావళి వేడుకలకు సుమారు 600 మంది భారత సంతతికి చెందిన ప్రముఖమైన వ్యక్తులు హాజరయ్యారు.. ఈ వేడుకల్లో ప్రతినిధుల సభ్యుడు రో ఖన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన తన పిల్లలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 2003 లో జార్జిబుష్ అధ్యక్షుడిగా ఉన్న నాటి నుంచి దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక అప్పటినుంచి ప్రతి ఏడాది వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు నిర్వహిస్తున్నారు.