Starlink: స్మార్ట్ ఫోన్.. 5జి సేవలు.. బీభత్సమైన నెట్ స్పీడ్.. హై రెజల్యూషన్ ఫోటోలు..5 కే క్వాలిటీ వీడియోలు.. ఇవే కాకుండా ఇంకా చాలా సదుపాయాలు నేటి కాలంలో మనం అనుభవిస్తున్నాం. కానీ మనదేశంలోనే ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. కొన్ని గ్రామాలలో ఇప్పటికీ సిగ్నల్స్ అందవు.. సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండదు. నేటి కాలంలో ప్రతిదీ కూడా అంతర్జాలం మీద ఆధారపడి ఉంది కాబట్టి.. సెల్ ఫోన్ సంకేతాలు లేకపోవడం వల్ల చాలా పనులు ఆగిపోతున్నాయి. అయితే ఇటువంటి వారికి ఒక శుభవార్త. త్వరలో ఈ ప్రాంతాల వారికి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
Also Read: అటు ఆర్చర్.. ఇటు బుమ్రా.. లార్డ్స్ లో రాణించే జట్టు ఏదో?
ఎలాన్ మస్క్ ఎవరూ ఊహించని వ్యాపారం లోకి అడుగుపెట్టాడు. ఎవరూ ఆలోచించని విధంగా సరికొత్త ప్రణాళికకు రూపకల్పన చేశాడు. తద్వారా తన కంపెనీ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ సేవలు అందించడానికి అతడు రంగం సిద్ధం చేశాడు. తన కంపెనీ పేరు స్టార్ లింక్ అని పేరు పెట్టుకున్నాడు. విభిన్నమైన కంపెనీలతో కంపెనీలతో ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్న మస్క్.. ఇప్పుడు స్టార్ లింక్ ద్వారా శాటిలైట్ కమ్యూనికేషన్స్ వ్యాపారం లోకి ప్రవేశించాడు. శాటిలైట్ కమ్యూనికేషన్స్ ద్వారా భారత దేశంలో ఇంటర్నెట్ సేవలు అందించబోతున్నాడు. ఈ మేరకు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ & ఆర్థరైజేషన్ సెంటర్ నిర్ణయం తీసుకుంది. స్టార్ లింక్ జెన్ -1 లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ ద్వారా ఐదు సంవత్సరాల పాటు సేవలు అందించడానికి అనుమతులు ఇచ్చింది. ఫలితంగా దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి..
మనదేశంలో అగ్ర గామి టెలికాం కంపెనీలుగా జియో, ఎయిర్టెల్ కొనసాగుతున్నాయి. అయితే ఇవి కేవలం నగరాలు, పట్టణాలు, మధ్యస్థాయి ప్రాంతాలలో మాత్రమే సేవలు అందిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలలో ఈ సంస్థలకు అంతగా కనెక్టివిటీ లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ సంస్థలు కేవలం కమర్షియల్ కోణాల్లో మాత్రమే ఆలోచిస్తున్నాయి. అందువల్లే సేవల విస్తరణ అంత సులభంగా సాగడం లేదు. మారుమూల గ్రామాలలో హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించడం ద్వారా ప్రజల జీవితాలు మెరుగుపడతాయని స్టార్ లింక్ భావిస్తోంది. పైగా ప్రస్తుతం ప్రతి పని కూడా ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతోంది. ఇక్కడ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తే ఈ ప్రాంతాల ముఖ చిత్రాలు మొత్తం మారతాయని స్టార్ లింక్ భావిస్తున్నది.. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి ఇటీవల ముఖేష్ అంబానీ కంపెనీ మస్క్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియ రాలేదు. అయితే ఇప్పుడు స్టార్ లింక్ సేవలు అందించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అనుమతులు ఇవ్వడం గమనార్హం.
ఐదు సంవత్సరాలు మాత్రమే సేవలు అందిస్తే.. ఆ తదుపరి ఎవరు కొనసాగిస్తారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇంటర్నెట్ అనేది నిరంతర వ్యవస్థ. అది కొంతకాలం మాత్రమే పనిచేయడానికి ఉండదు. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి ఆ సేవలకు అలవాటు పడితే.. తిరిగి వెనక్కి వెళ్లలేరు. అలాంటప్పుడు దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సేవలు అందిస్తేనే ఆ గ్రామాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి దీనిపై స్టార్ లింక్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.