Robots : రోడ్డు బాగుండాలి. వాహనం మీద వెళ్తుంటే ప్రయాణం చేసినట్టే అనిపించకూడదు. చిన్న గతుకులు ఉండకూడదు. గుంతలు అసలే కనిపించకూడదు. ఇలా ఊహించుకుంటేనే ఎంతో బాగుంది కదూ.. ఒకవేళ ఇదే నిజమైతే.. హా.. మనదేశంలో నేతలు మొత్తం సంక్షేమ పథకాల మంత్రం పఠిస్తున్న నేపథ్యంలో ఇది ఎలా సాధ్యం. ఇక గుంతలు లేని రోడ్లు ఎవరు వేస్తారని అనుకుంటున్నారు కదూ.. మీరు అనుకున్నది నిజమే.. కానీ అలాంటి రోడ్లకు మహర్దశ పట్టనుంది. అయితే అది మన నాయకుల ద్వారా కాదు.. మరయంత్రం ద్వారా..
టెక్నాలజీ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం అవుతోంది. ముఖ్యంగా కొన్ని కంపెనీలు మనిషి జీవితాన్ని మరింత సుఖవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే రోబోలతో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నాయి. అలా “రోబో టీజే3డీ” అనే కంపెనీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెరపైకి తెచ్చింది. ఇది “ఆట నమస్ రోడ్ రిపేర్ సిస్టం” అనే విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీనిలో చాలా విభాగాలు ఉన్నాయి అందులో ఒకటి ఏఆర్ఆర్ఈఎస్ఐ. పేరుకు తగ్గట్టుగానే ఇది రోడ్లను పూర్తిగా పరిశీలిస్తుంది. వాటి నాణ్యతపై నిరంతరం నిఘా పెడుతుంది. వేరువేరు వాహనాలు సులువుగా వెళ్లేందుకు వీలుగా ఇది నిరంతరం రోడ్లను లోతుగా విశ్లేషణ చేస్తుంది.
ఉపరితలంలో చిన్నచిన్న పగుళ్ల దగ్గరనుంచి మొదలుపెడితే పెద్ద గుంతల వరకు అన్నింటిని తన కెమెరాతో చిత్రీకరిస్తుంది. ఆ సమాచారాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ స్థూలంగా చెప్పాలంటే కేంద్ర విభాగానికి పంపిస్తుంది. ఏఆర్ఆర్ఈఎస్ వ్యవస్థలో మరో కీలకమైన అంశం ప్రివెంట్ అనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత రోబో. ఇది తనకు తాను గానే పనిచేస్తుంది. ఒక్కోసారి రిమోట్ కంట్రోల్ ఆధారంగా పనిచేస్తుంది. రోడ్డుమీద తిరుగుతుంది. ముందు జాగ్రత్తగా రోడ్లమీద పగుళ్లను పూడ్చుతుంది. పెద్ద గుంతలు ఏర్పడే ప్రమాదం ఉంటే ముందే హెచ్చరికలు జారీ చేస్తుంది. రోడ్లు నున్నగా ఉండేలా.. ఎక్కువ కాలం మన్నేలా చూస్తుంది. ఇక భారీ గుంతలకు సంబంధించి ఏఆర్ఆర్ఈఎస్ ఆల్ట్రా అనే మరో అధునాతన మరమ్మతు వ్యవస్థను రోబోటిజ్ 3 డీ కంపెనీనే రూపొందించింది. అయితే ఇవి రోడ్ల నిర్మాణంలోనే కాకుండా మిగతా పనులకు కూడా ఉపయోగించే విధంగా ఆ కంపెనీ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది.