Ritu Karidhal Chandrayaan 3: చంద్రయాన్–3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. శుక్రవారం (జూలై 14) మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్–3 తొలిదశ విజయవంతమైంది. అత్యంత ప్రతిష్టాత్మక మూన్ మిషన్‌కు చంద్రయాన్–3ని చేరువ చేసేందుకు ఉద్దేశించిన బాహుబలి రాకెట్ మొత్తం మూడు దశలనూ దాటుకుని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఘనత, శాస్త్రవేత్తలపై అభినందలు ప్రకటించారు.
సక్సెస్ అయిందని ప్రకటన..
ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయి, చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో చైర్మన్ శుక్రవారం ప్రకటించారు. చంద్రయాన్–3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది.
కీలక ప్రయోగం వెనుక ఆమె..
మరోవైపు ఈకీలక ప్రయోగం వెనుక కీలక శక్తిగా ఒక మహిళగా ఉండటం విశేషంగా నిలుస్తోంది. యూపీలో లక్నోలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రీతు కరిధాల్ స్పేస్ పట్ల అభిరుచి, అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన వార్తా కథనాలను సేకరించే ఆసక్తి, వీటన్నింటికీ సవాల్‌ను స్వీకరించే నైజం ఆమెను విజయ తీరాలను చేర్చింది. చిన్న వయస్సులోనే అంతరిక్ష శాస్త్రంపై ఉన్న మక్కువ నవంబర్ 1997లో ఇస్రోలో చేరడంతో ఆమె కల నెర వేరింది. తాజా విజయంతో యావద్దేశం గర్వపడేలా చేశారు.
సంబరాల్లో కుటుంబం..
చంద్రయాన్ 3 ప్రాజెక్టు సక్సెస్ కావడంతో రీతు కరిధాల్ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఆనంద క్షణాలను స్వీట్లు పంచుతూ సెలబ్రేట్ చేసుకుంది. ఇది చాలా సంతోషకరమైన క్షణం, సోదరిని చూసి చాలా గర్వపడుతున్నాను అంటూ రీతూ కరిధాల్ సోదరుడు రోహిత్ కరిధాల్ ఆనందాన్ని ప్రకటించారు.