Puri Jagannath Rath Yatra 2024: జగన్నాథ రథయాత్రలో ఏఐ టెక్నాలజీ వినియోగం.. దానివల్ల ఏం ఉపయోగమంటే..

పూరి జగన్నాథ రథయాత్ర సమయంలో ఒడిశాకు భారీగా భక్తులు వస్తుంటారు. ఇక ప్రజా ప్రతినిధుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రథయాత్ర జరుగుతున్నన్ని రోజులు ఊ పూరిలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 7, 2024 2:38 pm

Puri Jagannath Rath Yatra 2024

Follow us on

Puri Jagannath Rath Yatra 2024: ఏఐ.. టెక్నాలజీ రంగాన్ని ఒక ఊపు ఊపుతోంది. దీనివల్ల వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఇందులో కొత్త కొత్త ఆవిష్కరణలు సరికొత్త శాస్త్ర సాంకేతిక అనుభూతిని అందిస్తున్నాయి. అయితే ఈ టెక్నాలజీని ప్రస్తుతం ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో ఉపయోగిస్తున్నారు.. ఎంతో విశిష్ట చరిత్ర ఉన్న పూరి జగన్నాథ రథయాత్రలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం చర్చనీయాశంగా మారింది.

పూరి జగన్నాథ రథయాత్ర సమయంలో ఒడిశాకు భారీగా భక్తులు వస్తుంటారు. ఇక ప్రజా ప్రతినిధుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రథయాత్ర జరుగుతున్నన్ని రోజులు ఊ
పూరిలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు. అలాంటి సమయంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం పోలీసులకు సవాల్ గా మారుతుంది. ఇలాంటి సమయంలో అప్పుడప్పుడూ దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అందువల్లే ఈసారి ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఒడిశా పోలీసులు పైలట్ ప్రాతిపదికన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. “ఇది మొదటిసారి పైలెట్ ప్రాజెక్టుగా మేము ఆర్టిఫిషియల్ ఆధారిత సిసిటీవీ కవరేజీ ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికోసం 40 పాయింట్లు ఏర్పాటు చేశాం. అన్ని పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనుసంధానించాం. ఇవే కాకుండా పబ్లిక్ అడ్రస్ సిస్టం తో పాటు డ్రోన్ లను కూడా మేము ఉపయోగిస్తున్నాం. దీనివల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉంటుంది. పోలీస్ అధికారులకు ఉపయుక్తంగా ఉంటుందని” ఒడిశా అదనపు డీజీపీ దయాల్ గంగ్వార్ పేర్కొన్నారు.

ఇక పూరి జగన్నాధుడిని విష్ణు అవతారంగా భావిస్తారు.. పూరి జగన్నాథుడి యాత్రలో భాగంగా అతడి సోదరుడు బలభద్రుడు, సుభద్ర దేవి సమేతంగా.. గుండిచా ఆలయానికి భక్తులు రథంలో ప్రతిష్టించి తీసుకెళ్తారు. పూరి జగన్నాథ యాత్ర నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ” ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జగన్నాధ రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశం నలుమూలల నుంచి భక్తులు జగన్నాధుడి రథయాత్రలో పాల్గొనేందుకు వస్తుంటారు. రథంపై కూర్చున్న భగవంతుడి మూడు రూపాలు చూసి తరిస్తారని” రాష్ట్రపతి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పూరి జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పూరి జగన్నాథుడు శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకని కొనియాడారు. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లక్షలాదిమంది ప్రజలు జగన్నాధుడి రథోత్సవంలో పాల్గొంటారు. అక్కడ చారిత్రాత్మకమైన మహేష్ ఆలయం ఉంది. ఇక ఇక కోల్ కతా లోని ఇస్కాన్ ఆలయంలో నిర్వహించే జగన్నాధ రథయాత్రలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొంటారు..కాగా, జగన్నాథ రథయాత్ర కోసం ఒడిశా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.. గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల కోసం వీఐపీ జోన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రపతికి బఫర్ జోన్ ఏర్పాటు చేశారు..