
దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు వాట్సాప్ యాప్ ను ఉపయోగిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే సైబర్ నేరగాళ్లు వాట్సాప్ యూజర్లను టార్గెట్ చేస్తూ కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం వరకు ఫేక్ ఫేస్‌బుక్ ఐడీలతో మోసాలు చేసిన సైబర్ మోసగాళ్లు అమెరికా కేంద్రంగా వాట్సాప్ యాప్ తో మోసాలకు పాల్పడుతున్నారు. అమెరికాకు చెందిన కొందరి ఫోటోలను సేకరించి ఆ ఫోటోలను వాట్సాప్ డీపీలుగా పెడుతున్నారు.
ఆ తరువాత వారి ఫోన్లలో ఉన్న కాంటాక్ట్ నంబర్ల ద్వారా ఇండియాలో ఉన్న వారి సన్నిహితులకు మెసేజ్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఇండియాలో తమ సన్నిహితులు అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని తాము చెప్పిన అకౌంట్ నంబర్ కు వెంటనే డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురి వాట్సాప్ నెంబర్లకు ఈ తరహా మెసేజ్ లు వస్తుండటం గమనార్హం.
హైదరాబాద్ నగరంలోని బోయినపల్లికి చెందిన దిలీప్ కుమార్ కు న్యూయార్క్ లో ఉన్న తన స్నేహితుని ప్రొఫైల్ ఫోటో నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అత్యవసరంగా రూ.2 లక్షలు తాను చెప్పిన నంబర్ కు పంపాలని మెసేజ్ రాగా దిలీప్ వెంటనే డబ్బు పంపించాడు. ఆ తరువాత స్నేహితుడికి కాల్ చేయగా దిలీప్ కు మోసపోయానని అర్థమైంది. ఇలాంటి మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.
ఎవరైనా డబ్బుల కోసం మెసేజ్ చేస్తే పూర్తి వివరాలు కనుక్కుని డబ్బులు పంపాలని సూచిస్తున్నారు. వాట్సాప్‌లో తమ ఫొటోలు అందరికీ కనిపించకుండా ఉండేందుకు సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవాలని పోలీసులు చెబుతున్న్నారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అకౌంట్లతో ఈ తరహా మోసాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.