NASA Praised ISRO : ప్రపంచంలోనే ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ అమెరికాకు చెందిన నాసా.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను ప్రశంసించింది. ఇస్రో కొద్ది రోజుల కిందట శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. భారతదేశ ప్రజలు సగర్వంగా తలెత్తుకునేలా చేసింది ఈ ప్రయోగం. చందమామపై ఉన్న లోగుట్టును తెలుసుకునేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో చేసిన ఈ ప్రయోగం విజయవంతం అయితే చందమామపై ఇప్పటికీ అంతు చిక్కకుండా ఉన్న అనేక విషయాలను మానవ ప్రపంచానికి తెలియజేసే అవకాశం లభిస్తుంది. మూడు దశలను దాటుకొని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. కొన్ని గంటల క్రితమే ప్రపొల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయినట్లు ఇస్రో చైర్మన్ ప్రకటించారు. దీంతో చంద్రయాన్-3 ఉపగ్రహం చంద్రుడు వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ప్రకటించింది. ఈ విషయం తెలుసుకున్న భారతీయులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -3 ఉపగ్రహం ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడు ఉపరితలంపై ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగా సురక్షితంగా ల్యాండ్ అయితే మాత్రం సరికొత్త చరిత్రను భారత్ సృష్టించినట్లు అవుతుంది. ఇకపోతే అతి తక్కువ మొత్తంలోనే ఇస్రో ఈ ప్రయోగాన్ని చేసింది. అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు ఈ తరహా ప్రయోగాలకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తుంటే.. భారత్ మాత్రం వెయ్యి కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో ఈ ప్రయోగాన్ని చేసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక భారత్ విజయవంతంగా చంద్రయాన్ -3 ఉపగ్రహాన్ని ప్రయోగించడం పట్ల అమెరికా పరిశోధనా సంస్థ నాసా కూడా ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఇస్రోను మెచ్చిన నాసా సైంటిస్టులు..
ప్రపంచంలోనే ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థగా పేరుగాంచిన నాసా సైంటిస్టులు ఇస్రో చేసిన చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగాన్ని ప్రశంసించారు. విజయవంతంగా ఈ ప్రయోగాన్ని పూర్తి చేసినందుకుగాను ఇస్రో శాస్త్రవేత్తలపై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) అభినందనలు తెలియజేసింది. చంద్రయాన్ 3 ప్రయోగంలో లాండర్ సురక్షితంగా చంద్రుని పైకి చేరుకోవాలని నాసా ఒక ప్రకటనలో ఆకాంక్షించింది. నాసా లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ శ్రేణి సహా మిషన్ నుంచి వచ్చే శాస్త్రీయ ఫలితాల కోసం తాము ఎదురు చూస్తున్నామని వెల్లడించింది. ఇస్రో చేసిన ప్రయోగం పై నాసా శాస్త్రవేత్తలు అభినందనలు వ్యక్తం చేయడంతో పాటు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలుసుకున్న భారతీయులతోపాటు ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం గురించి ప్రపంచ దేశాలు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి అన్న విషయాన్ని తాజాగా నాసా చేసిన ప్రకటనను బట్టి చూస్తే అర్థమవుతుందని పలువురు సైంటిస్టులు పేర్కొంటున్నారు.
Congratulations to @isro on the Chandrayaan-3 launch, wishing you safe travels to the Moon. We look forward to the scientific results to come from the mission, including NASA’s laser retroreflector array. India is demonstrating leadership on #ArtemisAccords! https://t.co/98nwfm12V0
— Bill Nelson (@SenBillNelson) July 14, 2023