Whatsapp Ad: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు నిత్యం వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇకపై యాడ్స్‌తో కనిపించనుంది. ఫేస్‌బుక్ దీన్ని 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన 11 ఏళ్ల తర్వాత దాని మాతృసంస్థ మెటా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు లేకుండా ఉచితంగా సేవలు అందించిన వాట్సాప్, ఇప్పుడు ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. వ్యాపార ప్రకటనలు ఇకపై వాట్సాప్‌లో కనిపించనున్నట్లు మెటా జూన్ 16న ప్రకటించింది. ఈ యాడ్స్‌ను యూజర్లు యాప్‌లోని “అప్‌డేట్స్” ట్యాబ్‌లో మాత్రమే చూడగలుగుతారు. దీని ద్వారా ప్రకటనలను వ్యక్తిగత చాట్‌ల నుంచి వేరు చేయనున్నారు. ముఖ్యంగా, ఛానెల్స్ ఫీచర్‌ను కూడా మెటా డబ్బు సంపాదించడానికి ఉపయోగించుకోనుంది. ఇందులో సెర్చ్ యాడ్స్, సబ్‌స్క్రిప్షన్‌లు ఉంటాయి. దాదాపు 1.5 బిలియన్ల మంది యూజర్లు రోజూ ఈ అప్‌డేట్స్ ట్యాబ్‌ను చూస్తున్నారు. ఈ అవకాశాన్ని వాడుకుంటూ అడ్మిన్లకు, సంస్థలకు, వ్యాపారులకు వాట్సాప్ ద్వారా ఎదగడానికి అవకాశం కల్పించడం ఈ ప్రకటనల ముఖ్య ఉద్దేశం అని మెటా పేర్కొంది.
Also Read: ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం వల్ల.. వీటి ధరలు పెరుగుతాయి.. మన మీద పడే ప్రభావం ఎంత?
వాట్సాప్ మొత్తం మూడు రకాల యాడ్-సంబంధిత ఫీచర్లను తీసుకురానుంది:
ఛానెల్ సబ్‌స్క్రిప్షన్ : వాట్సాప్ యూజర్లు తమకు ఇష్టమైన ఛానెల్‌లకు నెలవారీ ఫీజు చెల్లించి మద్దతు ఇవ్వవచ్చు. ప్రస్తుతం, మెటా ఈ సబ్‌స్క్రిప్షన్ ఫీజుల నుండి తక్షణమే డబ్బు సంపాదించదు. కానీ భవిష్యత్తులో 10శాతం వాటాను తీసుకోనుంది.
ప్రమోటెడ్ ఛానెల్స్ : ప్రస్తుతం ఛానెల్స్‌ను ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని వాట్సాప్ ఛానెల్స్ కనిపిస్తాయి. ఇకపై ఛానెల్ అడ్మిన్లు తమ ఛానెల్ పాపులారిటీని పెంచుకోవడానికి కొంత ఫీజు చెల్లించి ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది యాపిల్, గూగుల్ యాప్ స్టోర్‌లలోని యాడ్స్‌కు సమానంగా ఉంటుంది.
స్టేటస్‌లో యాడ్స్: స్టేటస్‌లో ఇప్పటివరకు వ్యక్తుల స్టేటస్‌లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇకపై వ్యాపారాలకు సంబంధించిన స్టేటస్‌లు కూడా దర్శనమివ్వనున్నాయి. ఇవి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లా 24 గంటల తర్వాత మాయమవుతాయి.
యాడ్స్ కేవలం అప్‌డేట్స్ ట్యాబ్‌లో మాత్రమే కనిపిస్తాయని వాట్సాప్ స్పష్టం చేసింది. పర్సనల్ చాట్స్ ఎప్పటిలాగే యాడ్‌ఫ్రీగా ఉంటాయని, అలాగే కాల్స్, మెసేజ్‌లు, స్టేటస్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ గా ఉంటాయని కంపెనీ తెలిపింది. యాడ్స్‌ను చూపించడానికి, ఛానెల్‌ల కోసం యూజర్ దేశం, నగరం, డివైజ్, లాంగ్వేజ్ వారు ఎవరిని ఫాలో అవుతున్నారు లేదా యాడ్స్‌తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు వంటి ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే సేకరిస్తామని మెటా బిజినెస్ మెసేజింగ్ ప్రొడక్ట్ హెడ్ నికిలా శ్రీనివాసన్ తెలిపారు. అడ్వర్టైజర్లకు వ్యక్తుల ఫోన్ నంబర్‌ను విక్రయించడం లేదా పంచుకోవడం చేయబోమని వాట్సాప్ స్పష్టం చేసింది.
మెటా 2023 జూన్‌లో వాట్సాప్ అప్‌డేట్స్ ట్యాబ్‌ను, ఛానెల్స్ ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ఫీచర్లను అప్‌డేట్స్ ట్యాబ్‌లోనే ఉంచడం ద్వారా యూజర్లకు తక్కువ అంతరాయం కలుగుతుందని మెటా ఆశిస్తోంది. ఈ ప్రకటనలు ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తాయో మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ నిర్ణయం వాట్సాప్ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. ఇది మెటా వ్యాపార వ్యూహంలో ఒక ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు.