YouTube: యూట్యూబ్లో సరికొత్త ఫీచర్లు.. నెటిజన్లకు పండగే పండగ..

యూ ట్యూబ్ లో రోజు రోజుకు అనేక ఫీచర్లు తోడవుతున్నాయి. యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు యూ ట్యూబ్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ అనేక మార్పులు చేర్పులు చేపడుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 17, 2024 9:46 am

YouTube

Follow us on

YouTube: ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ తప్పనిసరి అయింది. అందులోనూ స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన తర్వాత యూ ట్యూబ్ చూడటం అనేది సర్వ సాధారణమైంది. ఇక యూట్యూబ్ కేవలం వీడియోలకు మాత్రమే కాకుండా.. నయా ఇన్ ఫ్లూయన్సర్ లకు కామధేనువు లాగా మారింది. యూ ట్యూబ్ చూసేవాళ్ళ సంఖ్య పెరగడంతో.. దాని మాతృ సంస్థ ఆల్ఫా బెట్ రకరకాల మార్పులు తీసుకొస్తోంది. తాజాగా తీసుకొచ్చిన ఫీచర్లు ఏంటంటే..

యూ ట్యూబ్ లో రోజు రోజుకు అనేక ఫీచర్లు తోడవుతున్నాయి. యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు యూ ట్యూబ్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ అనేక మార్పులు చేర్పులు చేపడుతోంది. ఇందులో భాగంగా కొత్త కొత్త ఫీచర్లను జతచేస్తూ యూజర్లకు సరికొత్త అనుభూతి కలిగిస్తోంది.. ఇప్పుడు మరికొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.. వాటికి స్లీప్ టైమర్, రీసైజబుల్ మినీ ప్లేయర్, ఫేవరెట్ ప్లే లిస్ట్ అనే మూడు కొత్త ఫీచర్లను యూసర్లకు పరిచయం చేసింది. ఈ విషయాన్ని యూట్యూబ్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా యూజర్లకు వెల్లడించింది.. ఈ కొత్త ఫీచర్లు ఎలా పనిచేస్తాయి.. వాటిని ఎలా ఉపయోగించాలి.. వాటి వల్ల కలిగే అనుభూతి ఎలా ఉంటుంది.. గతంలో ఎలా ఉండేది.. ఇప్పుడు తీసుకొస్తున్న మార్పులు ఏమిటి.. వీటివల్ల యూజర్ టైం ఎలా సేవ్ అవుతుంది.. అనే విషయాలను యూట్యూబ్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించింది.

స్లీపర్ టైం

చాలామందికి యూట్యూబ్లో వీడియోలు చూడటం ఒక వ్యసనం. అలా వీడియోలు చూస్తూనే చాలామంది నిద్రపోతుంటారు. దీంతో వీడియోలు అలానే ప్లే అవుతూ ఉంటాయి. డాటా కూడా ఖర్చవుతూ ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ యూట్యూబ్ సరికొత్త స్లీప్ టైమర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో టైమర్ సెట్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో వీడియోలను చూడవచ్చు. మనం నిర్ణయించుకున్న సమయం పూర్తికాగానే మన వీడియోస్ ఆటోమెటిక్ గా ఆగిపోతాయి. ఒకవేళ ఆ సమయానికి నిద్రలోకి వెళ్లినా ఫోన్ లో వీడియోలు ప్లే కావు.

ఇలా సెట్ చేసుకోవాలి

యూట్యూబ్లో వీడియోలను ప్లే చేసిన తర్వాత.. స్క్రీన్ పై కనిపించే సెట్టింగ్స్ ఐకాన్ ను ట్యాప్ చేయాలి.. అందులో స్లీప్ టైమర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.. దానిపై క్లిక్ చేసి మనకు కావాల్సిన టైం నిర్ణయించుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఆప్షన్ ప్రీమియం యూజర్లకు మాత్రమే యూట్యూబ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అయితే అందరికీ వర్తించేలాగా.. స్లీపర్ టైం తెరపైకి తీసుకొచ్చింది.

థంబ్ నైల్స్

యూట్యూబ్ లో మనకు నచ్చిన ప్లే లిస్ట్ రూపొందించుకునే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం వాటిని క్యూఆర్ కోడ్ కు సహాయంతో నచ్చిన వ్యక్తులకు పంపించే ఆప్షన్ ను యూట్యూబ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు ఆ జాబితాకు నచ్చిన థంబ్ నైల్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహాయంతో రూపొందించుకునే అవకాశాన్ని కల్పించింది. అవసరమైతే అందులో మీ ఫోటోలను కూడా జత చేసుకోవచ్చని యూట్యూబ్ మేనేజ్మెంట్ ప్రకటించింది.

మినీ ప్లేయర్.. నచ్చిన విధంగా..

మినీ ప్లేయర్ విధానంలో యూట్యూబ్ సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి మల్టీ టాస్కింగ్ అనే పేరు పెట్టింది. యూట్యూబ్ లో మినీ ప్లేయర్ కుడివైపు కింది భాగంలో కనిపిస్తుంది. దానిని ఎటువైపు కదిలించకుండా మన పని మనం చేసుకోవచ్చు. అయితే ఇకపై మినీ ప్లేయర్ మనకు నచ్చిన చోటుకు మార్చుకోవచ్చు. ఒకవేళ దాని సైజు కూడా పెంచుకోవచ్చు. లేకుంటే తగ్గించవచ్చు.

అందుబాటులోకి బ్యాడ్జ్

ఇవి మాత్రమే కాకుండా యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్ యాప్ కోసం బ్యాడ్జ్ అనే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఇది మాత్రమే కాకుండా మరికొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తామని యూట్యూబ్ ప్రకటించింది. రోజురోజుకు యూజర్లు పెరిగిపోతున్న నేపథ్యంలో సరికొత్త సౌలభ్యాలను అందుబాటులోకి తీసుకొస్తామని యూట్యూబ్ చెబుతోంది.