Blue Origin NS 25: తెలుగు వ్యక్తి అంతరిక్ష యాత్ర.. ఇంతకీ ఎందుకో తెలుసా?

గోపీచంద్ ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో జన్మించారు. ఎంబ్రిరిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్ లో గోపీచంద్ బీఎస్సీ పూర్తి చేశారు. అమెరికాలో స్థిరపడ్డారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 13, 2024 3:03 pm

Blue Origin NS 25

Follow us on

Blue Origin NS 25: మన పైన ఉన్న ఆకాశం ఎన్నో అద్భుతాలకు నెలవు. ఆ అంతరిక్షం, చంద్రుడు, నక్షత్రాలు వాటి చుట్టూ ఉన్న వాతావరణం.. ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. అలాంటి అంతరిక్షంలోకి ఇప్పటివరకు చాలామంది వెళ్లారు. అంతరిక్ష యాత్ర చేయాలని చాలామందికి ఉన్నా అది అంత సులువు కాదు. అదే అలాంటి అవకాశం ఓ తెలుగు వ్యక్తికి వచ్చింది. ఇంతకీ ఎవరు ఆ తెలుగు వ్యక్తి? ఎందుకు అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటున్నారు? దీనిపై ప్రత్యేక కథనం.

తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వివిధ రంగాల్లో స్థిరపడి అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు. అయితే ఇంతవరకు తెలుగువారిలో ఎవరూ అంతరిక్షంలోకి వెళ్ళలేదు. అలా అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి తెలుగు వ్యక్తిగా తోటకూర గోపీచంద్ అరుదైన ఘనతను సృష్టించబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ఎక్స్ లో బ్లూ ఆరిజన్ అనే సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ చేపట్టిన న్యూ షెపర్డ్ అనే ప్రాజెక్టులో భాగంగా గోపీచంద్ అంతరిక్ష యాత్రకు వెళ్ళనున్నాడు. అమెరికాలో ఉన్నప్పటికీ గోపీచంద్ కు భారత పాస్ పోర్ట్ ఉండడం విశేషం.

బ్లూ ఆరిజన్ అనే సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందింది. ఇప్పటికే ఆ సంస్థ న్యూ షెఫర్డ్ మిషన్ పేరుతో అంతరిక్ష యాత్రలు చేపడుతోంది. 2021లో జెఫ్ బెజోస్ సహా పలువురు అంతరిక్ష యానం చేసి వచ్చారు. ఇక బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టే ఎన్ఎస్ – 25 మిషన్ కు గోపీచంద్ తో సహా ఆరుగురు వ్యక్తులను ఎంపిక చేశారు. ఈ బృందంలో ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ వ్యాపారవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ బిజినెస్ మాన్ హెచ్ ఎస్. కెన్నెత్, సాహస యాత్రికుడు కరోల్ శాలార్, అమెరికా వైమానిక దళ మాజీ కెప్టెన్ డ్వైట్ ఉన్నారు. డ్వైట్ కు 1961 లోనే అంతరిక్ష యానానికి వెళ్లే అవకాశం లభించింది. అయితే పలు కారణాల వల్ల ఆయన ఆ యాత్రకు వెళ్ళలేకపోయారు.

ఇక గోపీచంద్ ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో జన్మించారు. ఎంబ్రిరిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ సైన్స్ లో గోపీచంద్ బీఎస్సీ పూర్తి చేశారు. అమెరికాలో స్థిరపడ్డారు. అట్లాంటా రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ఫ్రీజర్వ్ లైఫ్ అనే వెల్నెస్ సెంటర్ కు గోపీచంద్ వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నారు. ఆయన గతంలో పైలట్ గా శిక్షణ పొందారు. 10 సంవత్సరాల క్రితం మనదేశంలోని మెడికల్ ఎయిర్ ఎవాక్యుయేషన్ విభాగంలో పని చేశారు. అయితే బ్లూ ఆరిజిన్ సంస్థ అధికారికంగా ప్రకటించేంతవరకు గోపీచంద్ అంతరిక్ష యానానికి వెళ్లేది ఆయన కుటుంబానికి కూడా తెలియదు. గోపీచంద్ కు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటినుంచే అంతరిక్షంలోకి వెళ్లాలని ఉండేదట. చివరికి ఆ కోరిక బ్లూ ఆరిజన్ సంస్థ ద్వారా నెరవేరుతోందని గోపీచంద్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బ్లూ ఆరిజిన్ సంస్థ ఇప్పటివరకు ఆరు మిషన్లలో 31 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. మీరంతా సముద్రమట్టానికి 80 నుంచి 100 కిలోమీటర్ల ఎగువన ఉండే కర్మన్ లైన్ వరకు వెళ్లి వచ్చారు. మొత్తం 11 నిమిషాల పాటు ఈ యాత్ర సాగుతుంది. ఈ బృందంలోని సభ్యులు ధ్వని కంటే మూడు రెట్ల ఎక్కువ వేగంతో ప్రయాణిస్తారు. కర్మన్ లైన్ దాటిన తర్వాత కొన్ని నిమిషాల పాటు వారు భార రహిత స్థితిని చవిచూస్తారు. అక్కడి నుంచి భూమిని చూసుకుంటూ మెల్లగా పారాచూట్ల సహాయంతో ప్రత్యేక క్యాప్సూల్ లో కిందికి దిగుతారు. ఎన్ ఎస్ -25 మిషన్ కు సంబంధించిన ఖర్చు మొత్తాన్ని బ్లూ ఆరిజిన్ సంస్థ మాత్రమే కాకుండా ఇతర వ్యక్తులు కూడా భరిస్తున్నారు. అయితే వారు ఎవరనేది మాత్రం ఆ సంస్థ చెప్పడం లేదు. ఆరిజిన్ మాత్రమే కాకుండా ఇస్రో(భారత అంతరిక్ష సంస్థ) కూడా ఇలాంటి అంతరిక్ష యాత్రలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ స్పేస్ యాత్రకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణ, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్ర చేయనున్నారు.