Homeట్రెండింగ్ న్యూస్Infosys Layoffs: మానవత్వం మరిచిన ఇన్ఫోసిస్.. రాత్రి అమ్మాయిలని కూడా చూడకుండా బౌన్సర్లతో దారుణం

Infosys Layoffs: మానవత్వం మరిచిన ఇన్ఫోసిస్.. రాత్రి అమ్మాయిలని కూడా చూడకుండా బౌన్సర్లతో దారుణం

Infosys Layoffs: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా చేపట్టిన లేఆఫ్ చర్యలు ఐటీ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మైసూరు క్యాంపస్‌లో దాదాపు 400 మంది ఫ్రెషర్లను లేఆఫ్ చేయడం, వారికి తక్షణమే క్యాంపస్ ఖాళీ చేయాలని ఆదేశించడం యువ టెక్నాలజీ నిపుణులకు ఊహించని షాక్‌ తగిలినట్లు అయింది. తాజా నిర్ణయంతో ట్రైనీలు అకస్మాత్తుగా క్యాంపస్ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువతి ఒక్క రాత్రి సమయం ఇవ్వాలని కన్నీటితో వేడుకున్నప్పటికీ ఇన్ఫోసిస్ అధికారులు తిరస్కరించారని సమాచారం. “మీరు ఇకపై ఉద్యోగులు కాదు, సాయంత్రం 6 గంటలలోపు క్యాంపస్ ఖాళీ చేయండి” అంటూ ట్రైనీలకు నోటీసు అందించారని తెలిసింది. రెండున్నరేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూసిన ట్రైనీలకు ఇది తీవ్రమైన మానసిక ఆందోళనను కలిగించింది.

ఉదయం మీటింగ్‌కు రావాలని చెప్పిన కంపెనీ సెక్యూరిటీ బలగాలు, బౌన్సర్లు పెట్టి లేఆఫ్ ప్రక్రియను చేపట్టిందని ఉద్యోగులు వెల్లడించారు. లేఆఫ్ అయిన వారికి కంపెనీ నుండి వచ్చిన మెయిల్‌లో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని, ఇతరులతో చర్చించవద్దని స్పష్టంగా పేర్కొనబడిందని తెలుస్తోంది. లేఆఫ్ సమయంలో క్యాంపస్‌లో యూఎస్ క్లయింట్లు ఉన్నందున, వారికి ఈ పరిస్థితి కనిపించకుండా బస్సులను అడ్డుగా పెట్టి ఒక్కొక్కరిని పిలిచి లేఆఫ్ గురించి సమాచారం అందించినట్లు ట్రైనీలు తెలిపారు.

2024లో కంపెనీ అర్హత ప్రమాణాలను మరింత కఠినతరం చేయడం వల్లే చాలా మంది ఫెయిల్ అయ్యారని ట్రైనీలు చెబుతున్నారు. కంపెనీ మాత్రం ఈ చర్యను సమర్థించుకుంటూ, “మేము హై-క్వాలిటీ టాలెంట్‌ను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాం” అని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీలో ట్రైనింగ్ పొందుతున్న 4,500 మంది ఫ్రెషర్లు ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గత రెండున్నరేళ్లుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో అనేక మార్పులు చేసిన సంస్థ, 2022లో అందించిన ట్రైనింగ్ సమయాన్ని భారీగా తగ్గించిందని, పాసింగ్ క్రైటీరియాను కఠినతరం చేసిందని ఫ్రెషర్లు ఆరోపిస్తున్నారు.

2024లో గ్లోబల్ ఐటీ రంగం మందగమనంతో అనేక కంపెనీలు రిక్రూట్మెంట్, హైరింగ్ ప్రక్రియను నిలిపివేశాయి. ఇన్ఫోసిస్ కూడా ఈ మార్గంలోనే నడుచుకుంటూ ఎంపిక ప్రక్రియను కఠినతరం చేసి చివరికి అనేకమందిని ఇంటికి పంపించిందని ట్రైనీలు వాపోతున్నారు. ఐటీ రంగంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేంత వరకు ఉద్యోగుల భద్రత అనిశ్చితంగానే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version