Rainfall: ప్రస్తుతం ప్రతి పదిమందిలో ఏడుగురి వద్ద స్మార్ట్ ఫోన్ ఉంది. అందులో వాతావరణం గురించి చెప్పే అప్లికేషన్ ఇన్ బిల్ట్ గా ఉంది. దాని ప్రకారం మన ప్రాంతంలో వర్షం కురుస్తుందా? ఎండ కాస్తుందా? చలి వేస్తుందా? అనే విషయాలను తెలుసుకోవచ్చు. అంతేతప్ప భారీ వర్షం ఎప్పుడు కురుస్తుంది? దానివల్ల ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? అనే విషయం మాత్రం ఆ అప్లికేషన్ చెప్పలేదు. అయితే ఈ సమస్యకు కృత్రిమ మేధ పరిష్కారాన్ని చూపుతోంది.
ఐఐటీ భువనేశ్వర్ కృత్రిమ మేధ సహాయంతో హైబ్రిడ్ టెక్నాలజీని రూపొందించింది. ఇది వాతావరణ అంచనా రంగంలో తనదైన ముద్రను వేస్తోంది. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ ద్వారా వెదర్ రీసర్చ్ అండ్ ఫోర్ కాస్టింగ్ (డబ్ల్యూ ఆర్ ఎఫ్) మోడల్ ను డీప్ లెర్నింగ్ ( డీ ఎల్) మోడల్ సమ్మేళనంతో ముందుగానే భారీ వర్షాలను అంచనా వేయొచ్చు. వాతావరణాన్ని అప్పటికి అప్పుడే పసిగట్టవచ్చు. దీనివల్ల వెంటనే అప్రమత్తం కావచ్చు. లేదా అప్రమత్తం చేయవచ్చు. ఈ సాంకేతికత ద్వారా జరిగే నష్టాన్ని నివారించవచ్చు. వాస్తవానికి ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ చెబుతున్న అంచనాలు కొన్నిసార్లు విఫలమవుతున్నాయి. కానీ ఇలాంటి సమయంలో స్పష్టమైన సమాచారం చెప్పడంలో వాతావరణ శాఖ సఫలీకృతం కాకపోవడంతో నష్టం ఎక్కువగా చోటు చేసుకుంటున్నది. అయితే భారీ వర్షాలు కురుస్తాయని ముందే చెప్పే సాంకేతికత ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు.
అస్సాం, భువనేశ్వర్ లో పరీక్షించారు
ఐఐటి భువనేశ్వర్ రూపొందించిన హైబ్రిడ్ టెక్నాలజీ పై ఇటీవల అస్సాం, భువనేశ్వర్ ప్రాంతంలో పరీక్షించారు. అస్సాంలో సాంప్రదాయ మోడల్స్ ఉన్నాయి. ఇది వర్షాలు ఎప్పుడు వస్తాయో మాత్రమే చెబుతున్నాయి. అంతేతప్ప భారీ వర్షాల గురించి సమాచారం ఇవ్వడం లేదు. అయితే వాటితో పోల్చి చూస్తే ఐఐటి భువనేశ్వర్ హైబ్రిడ్ మోడల్ నూటికి నూరు శాతం స్పష్టమైన ఫలితాన్ని ఇచ్చింది. రెట్టింపు కచ్చితత్వంతో పూర్తి వివరాలను చెప్పింది.. 96 గంటల ముందే భారీ వరదలను ఇది అంచనా వేసింది.
ఎంతో ఉపయోగం
మనదేశంలో ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తుంటాయి. ఉత్తరాది ప్రాంతాల్లోనూ వర్షాలు అధికంగానే కురుస్తుంటాయి. దీనివల్ల విపరీతమైన నష్టం సంభవిస్తూ ఉంటుంది. దీనికి ప్రాణనష్టం అదనం. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు.. వాటి మరమ్మతులకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో ఐఐటి భువనేశ్వర్ రూపొందించిన హైబ్రిడ్ టెక్నాలజీ సరికొత్త మార్గంగా కనిపిస్తోంది. ఒకవేళ గనుక ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. భారీ వర్షాల నుంచి సంభవించే నష్టాన్ని తగ్గించవచ్చు. ప్రాణ నష్టానికి కూడా సమూలంగా నివారించవచ్చు. ఇలాంటి ప్రయోగాలు గతంలో జరిగినప్పటికీ.. హైబ్రిడ్ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి.. ఈ స్థాయిలో వాడటమనేది ఇదే తొలిసారి. అస్సాం, ఒడిశా రాష్ట్రాలలో దీనిని ప్రయోగించి.. విజయవంతమైన ఫలితాలను సాధించిన నేపథ్యంలో.. దీనిని మరింతగా అభివృద్ధి చేసే పనిలో పడ్డారు ఐఐటి భువనేశ్వర్ శాస్త్రవేత్తలు. దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వారు చెబుతున్నారు. ఒకవేళ గనుక ఇది అందుబాటులోకి వస్తే భారీ వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలుసుకోవచ్చు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More