Digital Voter ID: ఎన్నికలవేళ.. డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ పొందండిలా..

చాలా మంది వద్ద ఆధార్, పాన్, జాబ్ (ఉద్యోగం గనుక చేస్తుంటే) ఐడీ కార్డులు కచ్చితంగా ఉంటాయి. అయితే కొంతమంది దగ్గర ఓటర్ ఐడీ కార్డు ఉంటుంది. మరి కొంతమంది వద్ద ఉండదు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 19, 2024 4:45 pm

Digital Voter ID

Follow us on

Digital Voter ID: దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. శుక్రవారం 21 రాష్ట్రాలలో 102 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. ఇక ఇటీవల కాలంలో ఫోన్ వాడకం పెరిగిపోయింది. అందులోనే అన్ని రకాల గుర్తింపు కార్డులను భద్రపరచుకోవడం ఎక్కువైంది. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ మన ఫోన్లోనే నిక్షిప్తమై ఉంటే బాగుంటుంది కదా.. మారిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల.. నెట్ సెంటర్లకు వెళ్లకుండానే.. మొబైల్ లోనే డిజిటల్ ఓటర్ ఐడీ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

చాలా మంది వద్ద ఆధార్, పాన్, జాబ్ (ఉద్యోగం గనుక చేస్తుంటే) ఐడీ కార్డులు కచ్చితంగా ఉంటాయి. అయితే కొంతమంది దగ్గర ఓటర్ ఐడీ కార్డు ఉంటుంది. మరి కొంతమంది వద్ద ఉండదు. అలాంటివారు డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ ఎలా పొందాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు సులువుగా తమ మొబైల్ ఫోన్లోనే ఐడీ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిని వారు తమ ఫోన్ లోనే భద్రపరచుకోవచ్చు. లేకుంటే ఆధార్ కార్డు లాగా లామినేషన్ చేసుకుని దగ్గర ఉంచుకోవచ్చు. ఇంతకీ అది ఎలాగంటే..

ఈ విధానంలో ముందుగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్ (http://voters eci.gov.in/login) లోకి వెళ్ళాలి. అందులో ఈ అధికారిక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే పాస్ వర్డ్ సెట్ చేసుకోమని చెప్పింది. అది ఇవ్వగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం మీరు మీ మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే..ఒక కప్చా నంబర్ వస్తుంది. దాన్ని టైప్ చేస్తే లాగిన్ అవ్వచ్చు.

అలా లాగ్ ఇన్ అయిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ లాగిన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఒరిజినల్ సైట్ కనిపిస్తుంది. అందులో కుడివైపు కింద మూలన ఉన్న e-epic డౌన్లోడ్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఒక స్క్రీన్ కనిపిస్తుంది. అందులో మీరు ఇంటర్ ఎపిక్ నెంబర్ దగ్గర మీ ఓటర్ ఐడీ కార్డు సంబంధించిన ఎపిక్ నెంబర్ టైప్ చేయాలి. ఆ తర్వాత సెలెక్ట్ స్టేట్లో మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు మీ ఓటర్ ఐడి కి సంబంధించిన వివరాలు చూపిస్తుంది. ఆ ఓటర్ ఐడి మీకు సరైనది అనిపిస్తే అప్పుడు మీరు కింద ఉన్న రీసెండ్ ఓటిపి పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటిపిని ఎంటర్ చేసి, వెరిఫై బాక్స్ పై క్లిక్ చేయాలి. మీరు ఎంటర్ చేసిన ఓటిపి సరైనదే అయితే కరెక్ట్ అని చూపిస్తుంది. ఆ తర్వాత మీరు మీ డిజిటల్ ఓటర్ ఐడి కార్డు కోసం డౌన్లోడ్ ఎపిక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అది మీ మొబైల్ లో పిడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ అవుతుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. లామినేషన్ చేస్తే ఆధార్ కార్డు లాగా భద్రపరచుకోవచ్చు. మొబైల్ తో సేవ్ చేసుకుంటే ఎప్పుడైనా అధికారులు అడిగినప్పుడు దాన్ని చూపించవచ్చు.