Hotel On The Moon: నేటి కాలంలో జనాలు లగ్జరీకి విపరీతమైన ప్రయారిటీ ఇస్తున్నారు. కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషిస్తున్నారు. అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. దీనికోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి వెనుకాడడం లేదు. మరోవైపు ప్రజల ఆసక్తిని గమనించిన సంస్థలు కొత్త కొత్త సౌలభ్యాలను, సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అటువంటిదే ఇది కూడా..
మన చిన్నప్పుడు అమ్మ చెప్పే కథల్లో చందమామ గురించి వినే ఉంటాం. అమ్మ చెబుతున్న మాటల్లో చందమామ గురించి గొప్పగా ఊహించుకుంటాం. పైగా పున్నమి వేళల్లో చందమామ నిండుగా కనిపిస్తాడు. వెన్నెల వెలుగులో అందంగా దర్శనమిస్తాడు. ఎక్కడో లక్షల కిలోమీటర్ల దూరం నుంచి కనిపించే చందమామ మనకు అందంగా దర్శనమిచ్చినప్పటికీ.. మనకు కనిపించిన అంత గొప్పగా చందమామ దగ్గర వాతావరణం ఉండదు. అక్కడ ఆక్సిజన్ ఉండదు. నీరు కూడా లభించదు. పైగా అక్కడ భార రహిత స్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి చోట ఓ కంపెనీ హోటల్ నిర్మిస్తోంది. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.
అమెరికాకు చెందిన ఓ కంపెనీ 2032 నాటికి చంద్రుడి వద్ద ఒక హోటల్ నిర్మించాలని భావిస్తోంది. ఈ హోటల్లో వ్యోమగామలు, అత్యంత సంపన్నమైన పర్యాటకుల కోసం ఈ హోటల్ నిర్మిస్తోంది.. భార రహిత స్థితి, పైగా అంతరిక్షం, చెంతనే చందమామ.. ఇన్ని అద్భుతాలు ఉన్నాయి కాబట్టి పర్యాటకులు కచ్చితంగా ఆస్వాదిస్తారని ఆ కంపెనీ నమ్ముతోంది. ఇలా ఒకరోజు అక్కడ ఉండే పర్యాటకుల నుంచి దాదాపు 3.7 కోట్లు వసూలు చేస్తుంది.
ఈ హోటల్ నిర్మాణం కేవలం లగ్జరీ కోసమే కాదని.. దీర్ఘకాలంలో చంద్రుడి మీద మనుషుల ఉనికిని బలోపేతం చేయడానికని ఆ కంపెనీ చెబుతోంది. భవిష్యత్తు కాలంలో జనాభా పెరిగితే.. ఆ స్థాయి ఒత్తిడిని భూమి భరించలేదు. అందువల్లే ప్రత్యామ్నాయంగా చంద్రుడి వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆ కంపెనీ చెబుతోంది. అయితే హోటల్ నిర్మాణం పూర్తయిన తర్వాత.. అంతరిక్ష పర్యటకం మరింత ఊపు అందుకుంటుందని ఆ కంపెనీ చెబుతోంది. మరోవైపు ఇప్పటికే అమెజాన్, ఎక్స్ కంపెనీలు స్పేస్ టూరిజానికి శ్రీకారం చుట్టాయి.
