Team India Coach: టీమ్ ఇండియాకు ఏం ముహూర్తాన కోచ్ గా వచ్చాడో తెలియదు గాని.. గౌతమ్ గంభీర్ విపరీతమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. వరుస ఓటములు.. ముఖ్యంగా టెస్ట్ ఫార్మేట్ లో దారుణమైన పరాభవాలు గౌతమ్ గంభీర్ ను తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నాయి. పైగా జట్టు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మార్పులు, చేర్పులు చేస్తున్న నేపథ్యంలో అవి టీమిండియా విజయాలపై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఇటీవల న్యూజిలాండ్ సిరీస్ లో కూడా ఫామ్ లో లేని రవీంద్ర జడేజాను తీసుకుని గౌతమ్ గంభీర్ విమర్శల పాలయ్యాడు. అక్షర్ పటేల్ ను దూరం పెట్టడంతో టీమిండియా మిడిల్ ఓవర్లలో ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీనికి తోడు గిల్ ను జట్టు మీద అనవసరంగా రుద్దుతూ.. యశస్వి జైస్వాల్ వంటి ప్లేయర్ ను దూరం పెట్టడం కూడా గౌతమ్ గంభీర్ ను విమర్శల పాలు చేస్తోంది. గౌతమ్ గంభీర్ పనికిమాలిన నిర్ణయాల వల్లే టీమిండియా ఇలా ఇబ్బంది పడాల్సి వస్తోందని.. చివరికి స్వదేశంలో కూడా ఓడిపోవలసి వస్తోందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ ఏకపక్ష నిర్ణయాల వల్ల టీమిండియా ఇబ్బంది పడుతోందని.. అతడు కోచ్ పదవికి ఏమాత్రం అర్హుడు కాదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొంతమంది అభిమానులైతే టీమిండియా కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ ను తొలగించాలని.. ఆస్థానంలో యువరాజ్ సింగ్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యువరాజ్ శిక్షణలో అభిషేక్ శర్మ, గిల్ ఎంతటి నైపుణ్యం సాధించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. గౌతమ్ గంభీర్ శిక్షణ ఇచ్చిన హర్షిత్ ఎలా ఆడుతున్నాడో అందరికీ తెలుసని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్ ను కోచ్ పదవి నుంచి తొలగించాలని వ్యక్తం అవుతున్న డిమాండ్ ఈనాటిది కాదు. గతంలోనే అతడి స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ను తీసుకోవాలని సోషల్ మీడియాలో ఒక ఉద్యమం నడిచింది. దానిపై వివిఎస్ లక్ష్మణ్ స్పందించలేదు. కాగా, వివిఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం బీసీసీఐలో కీలకమైన పదవిలో ఉన్నారు. అప్పట్లో జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం తదుపరి కోచ్ వివిఎస్ లక్ష్మణ్ అని తేలింది. అయితే దీనిపై ఇంతవరకు బీసీసీఐ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.
