Google tracking permission: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ప్రైవసీ అనేది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. మనమంతా సేఫ్ గా ఉన్నామని అనుకుంటున్నాం కానీ నిజంగానే మన వ్యక్తిగత సమాచారం ఎంతవరకు గోప్యంగా ఉంది? ఇటీవల ఒక అమెరికా సెనేట్ విచారణలో అడిగిన ఒక ప్రశ్నకు సుందర్ పిచాయ్ వివరణ ఇచ్చారు. అక్కడ అధికారి “నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే, గూగుల్‌కి తెలుస్తుందా?” ఈ ప్రశ్నకు సుందర్ పిచాయ్ ‘అవును’ అనో, ‘కాదు’ అనో ఇవ్వలేదు. బదులుగా, “మీరు ఏ సేవలకు అనుమతి ఇచ్చారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది…” అని తెలిపారు. కానీ మనలో చాలామందికి తెలియకుండానే ఎన్నో సేవలకు ఫోన్లో అనుమతిలు ఇస్తూనే ఉంటాం. వాస్తవానికి మీ జేబులో ఉన్న ఫోన్.. మీ గురించి అన్నీ చెప్పేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ట్రాక్ చేస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు వింటుంది. తర్వాత మీరు ఏం చేయబోతున్నారో అంచనా వేస్తుంది.
Also Read: Google has started again: గూగుల్ మళ్లీ మొదలుపెట్టింది.. భవిష్యత్తు కాలం మొత్తం ఏఐ దే!
గ్లోబల్ నిఘా అంటే ఏమిటి?
గ్లోబల్ నిఘా అంటే ప్రభుత్వాలు, పెద్ద కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల కదలికలు, సంభాషణలు, డిజిటల్ కార్యకలాపాలను పెద్ద ఎత్తున పర్యవేక్షిస్తుంటాయి. ఎడ్వర్డ్ స్నోడెన్ 2013లో చేసిన లీకుల తర్వాత ఈ నిఘా కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి నుంచి చాలా దేశాల్లో ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ప్రస్తుతం మన సమాచారం డిజిటల్ రూపంలో సోర్ట్ చేయబడుతోంది. ఫోటోలు, మాటలు, ఆరోగ్య సమాచారం, ఆర్థిక వివరాలు – ఇవన్నీ డిజిటల్‌గానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 770 మిలియన్లకు పైగా నిఘా కెమెరాలు ఉన్నాయని ఒక నివేదిక వెల్లడించింది. ఇందులో 54శాతం చైనాలోనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో కూడిన నిఘా వ్యవస్థలు 70కి పైగా దేశాల్లో ఇప్పటికే అమలులో ఉన్నాయి.
గూగుల్ వంటి పెద్ద టెక్ కంపెనీలు వినియోగదారుల గురించి విపరీతమైన డేటాను సేకరిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఉదాహరణకు, గూగుల్ ఒక్కో వినియోగదారుడికి సంబంధించిన 39 రకాల వ్యక్తిగత డేటాను ట్రాక్ చేస్తుందట. ఇందులో మీ పేరు, ఫోన్ నంబర్, మీరు చేసే చెల్లింపులు, చిరునామా, మీరు రాసే, అందుకునే ఇమెయిల్‌లు, మీ స్టోర్ చేసిన వీడియోలు, ఫోటోలు, పత్రాలు, స్ప్రెడ్‌షీట్‌లు, యూట్యూబ్‌లో మీరు చేసే కామెంట్లు.. ఇలా ఎన్నో ఉంటాయి.
Also Read: Google Drive full: మీ గూగుల్ డ్రైవ్ నిండిందా? స్టోరేజ్ కోసం డబ్బులు పెట్టాల్సిన అవసరం అసలు లేదు
అంతేకాకుండా, మీ లొకేషన్, సెర్చ్ హిస్టరీ, కొనుగోలు హిస్టరీ, మీరు సందర్శించే వెబ్‌సైట్లు, యాప్‌ల వాడకం, మీ ప్రవర్తన– ఇలా అన్నిటినీ సేకరిస్తున్నాయి. ఈ డేటాను ఉపయోగించి కంపెనీలు తమ సేవలను మెరుగుపరుచుకుంటాయి. డిజిటల్ యుగంలో ప్రైవసీ అనేది ఒక కల మాత్రమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మనం వాడే ప్రతి యాప్, ప్రతి డివైస్, మనం వెళ్ళే ప్రతి చోటు.. అన్నీ మన గురించి ఏదో ఒక సమాచారాన్ని సేకరిస్తున్నాయి. తెలిసో తెలియకో మనం ఇచ్చే పర్మీషన్ల వల్ల మన జీవితం ఒక తెరిచిన పుస్తకంలా మారిపోయింది.