Google Maps : ఈ రోజుల్లో ఎక్కడికైనా తెలియని ప్రదేశాలకు వెళ్లాలంటే మనం ముందుగా గూగుల్ మ్యాప్స్ ఆన్ చేస్తాం. దారి తెలుసుకోవాలన్నా, ట్రాఫిక్ చూడాలన్నా, దగ్గర్లోని హోటల్స్ వెతకాలన్నా గూగుల్ మ్యాప్స్ ప్రతి చోటా మనకు ఉపయోగపడుతుంది. అయితే మ్యాప్‌పై కనిపించే వేర్వేరు రంగుల గీతల అర్థం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా ? గూగుల్ మ్యాప్స్‌లో రంగుల ద్వారా చాలా సమాచారం లభిస్తుంది. మీరు ఈ రంగులను అర్థం చేసుకుంటే మీ ప్రయాణం మరింత ఈజీ అవుతుంది.
Also Read : ఐబీఎం హెచ్ఆర్ లో ఏఐ.. భారీగా ఉద్యోగాలు కట్?
గూగుల్ మ్యాప్‌లో రోడ్లపై కనిపించే గీతలు:
ఆకుపచ్చ రంగు (Green Color): ఇది ఓపెన్ చేసిన, స్పష్టమైన రహదారిని సూచిస్తుంది. మీరు ఏదైనా రహదారిని ఆకుపచ్చ రంగులో చూసినప్పుడు అక్కడ ట్రాఫిక్ లేదని అర్థం. మీరు ఆ దారిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈజీగా ప్రయాణించవచ్చు.
పసుపు లేదా నారింజ రంగు (Yellow or Orange Color): ఈ రంగులు రహదారిపై కొద్దిగా ట్రాఫిక్ ఉందని సూచిస్తాయి. రహదారి పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తే అక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది. అంటే, వాహనాలు కొద్దిగా నెమ్మదిగా కదులుతున్నాయి.. కానీ ఆగకుండా వెళ్తున్నాయి.
ఎరుపు రంగు (Red Color): ఎరుపు రంగు గీత భారీ ట్రాఫిక్‌ను సూచిస్తుంది. దీని అర్థం ఆ దారిలో చాలా రద్దీగా ఉందని. వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి లేదా ట్రాఫిక్ జామ్ కూడా ఉండవచ్చు. ఎరుపు రంగు ముదురుగా ఉంటే జామ్ మరింత పెరుగుతోందని అర్థం చేసుకోవచ్చు.
నీలం రంగు (Blue Color): మీరు ఏదైనా ప్రదేశానికి దారి వెతుకుతున్నప్పుడు ఏర్పడే నీలం రంగు గీత మీకు మార్గాన్ని చూపిస్తుంది. నీలం రంగు అంటే ఇది మీరు సెలక్ట్ చేసుకున్న రోడ్డు అని అర్థం.
గోధుమ రంగు (Brown Color): ఈ రంగు పర్వతాలు లేదా ఎత్తైన ప్రాంతాలను సూచిస్తుంది. ఏదైనా ప్రదేశంలో గోధుమ రంగు కనిపిస్తే అది కొండ లేదా ఎత్తైన ప్రాంతమని అర్థం చేసుకోవచ్చు. ఈ సమాచారం హైకింగ్ లేదా ట్రెకింగ్ చేసేవారికి ఉపయోగపడుతుంది.
ఊదా రంగు (Purple Color): కొన్నిసార్లు మీరు ఒక దారిని ఎంచుకున్నప్పుడు గూగుల్ మీకు ఊదా రంగులో మరొక ఆప్షన్లను చూపుతుంది. ఈ దారులు కొంచెం పొడవుగా లేదా ట్రాఫిక్‌తో నిండి ఉండవచ్చు.
గూగుల్ మ్యాప్స్‌లో కనిపించే ఈ వేర్వేరు రంగులు వెళ్తున్న రోడ్డు గురించి అర్థం చేసుకునేందుకు ట్రాఫిక్‌ను అంచనా వేయడానికి, సరైన మార్గాన్ని సెలక్ట్ చేసుకోవడానికి సహాయపడతాయి. ఈ రంగుల అర్థం తెలుసుకుంటే మీ ప్రయాణం మరింత సులభం అవుతుంది. కాబట్టి ఈసారి మీరు గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసినప్పుడు ఈ రంగులను జాగ్రత్తగా చూడండి.
Also Read : సన్నని డిజైన్.. పవర్ఫుల్ ప్రాసెసర్.. 200MP కెమెరాతో శామ్‌సంగ్ నయా ఫోన్