Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీGoogle Maps: గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్లు.. యూజర్ల ప్రయాణం ఇకపై మరింత సుఖవంతం

Google Maps: గూగుల్ మ్యాప్స్ లో కొత్త ఫీచర్లు.. యూజర్ల ప్రయాణం ఇకపై మరింత సుఖవంతం

Google maps: సాంకేతిక పరిజ్ఞానం అరచేతిలోకి వచ్చింది. చేతిలో ఇమిడిపోయే ఫోన్ మాత్రమే కాదు.. రయ్యి మంటూ దూసుకెళ్లే కార్లలోనూ టెక్నాలజీ ఇమిడిపోయింది. నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటే చాలు ఏదైనా చేయొచ్చు.. ఎక్కడికైనా వెళ్లొచ్చు అనే తీరుగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయితే మనలో చాలామంది వాహనాన్ని నడిపేటప్పుడు గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగించుకుంటారు. శాటిలైట్ ఆధారిత ఈ సేవ యూజర్లకు ఒక వరం లాంటిది. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ యూజర్లను తప్పుదోవ పట్టించినప్పటికీ.. చాలావరకు గూగుల్ మ్యాప్స్ ప్రయాణికుల అవసరాలను తీరుస్తున్నాయి. వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. సురక్షితవంతమైన ప్రయాణానికి వీలు కల్పిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సంస్థల భాగస్వామ్యంతో గూగుల్ తన మ్యాప్స్ సౌలభ్యాన్ని ఆధునికీకరించింది. సరికొత్త అనుభూతిని యూజర్లకు అందించేందుకు ఫీచర్లను తీసుకొచ్చింది.

ఫిర్యాదుల నేపథ్యంలో..

గూగుల్ మ్యాప్స్ వినియోగించే వారిలో చాలామంది చేసే ఫిర్యాదు ఒకటే. గూగుల్ మ్యాప్స్ అత్యంత దుర్భేద్యమైన దారులను చూపిస్తుందని.. కార్ల వంటి వాహనాలు ప్రయాణం సాగించేందుకు అనువు గాని దారులను అది సిఫారసు చేస్తుందని అంటుంటారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇరుకుదారుల ఇబ్బందని పక్కకు తప్పించేందుకు సరికొత్త ఫీచర్ తెరపైకి తీసుకొచ్చింది. కార్ల వంటి వాహనాలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి గూగుల్ ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. దీనివల్ల ఉపగ్రహ చిత్రాలు, వీధి వ్యూ, ఇతర సమాచారాన్ని నిర్దేశించుకుని, ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకొని రోడ్ల అసలు ముఖచిత్రాన్ని గూగుల్ మ్యాప్స్ అంచనా వేస్తుంది. రద్దీగా ఉండే ప్రాంతాలలో అత్యంత సులభంగా ప్రయాణించేలాగా దారులను సూచిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు దేశంలోని ఎనిమిది అతిపెద్ద నగరాలలో ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చామని గూగుల్ చెబుతోంది.

ముందే తెలుసుకునే అవకాశం

ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు.. ఆ మార్గంలో వంతెన ఉన్నప్పుడు.. పై బ్రిడ్జి మీదగా వెళ్లాలా? వద్దా? అనే ప్రశ్న యూజర్ నుంచి ఎదురైనప్పుడు.. గూగుల్ మ్యాప్స్ సరైన సమాధానం చెప్పడం లేదు. అయితే దీనిని పరిష్కరించేందుకు గూగుల్ ఒక కొత్త ఫీచర్ అందుబాటులో తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా 40 పట్టణాల్లో సిఫారసు చేసిన దారులలో ఫ్లై ఓవర్లను చూపిస్తుంది. ముందుగా వచ్చే ఫ్లై ఓవర్ల గురించి ముందే తెలిసే అవకాశం ఉండడంతో.. ఇది డ్రైవర్లకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది.

ఆ సదుపాయం కూడా..

మనదేశంలో మెట్రో నగరాలు చాలా ఉన్నాయి. ఈ నగరాలలో మెట్రో రైల్ టికెట్లను ముందుగానే బుక్ చేసుకునే సదుపాయాన్ని గూగుల్ మ్యాప్స్ కల్పిస్తోంది. ఓన్ డీసీ, నమ్మ యాత్రితో ఇది భాగస్వామ్యమై పనిచేస్తుంది. ఫలితంగా గూగుల్ మ్యాప్స్ ద్వారా నేరుగా మెట్రో టికెట్లు కొనుగోలు చేయొచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగించవచ్చు.

చార్జింగ్ స్టేషన్లను చెప్పేస్తుంది

ఎలక్ట్రానిక్ వెహికల్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. ఈవీ చార్జింగ్ సౌలభ్యాన్ని కలిగించే సంస్థలతో గూగుల్ భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది. ఈ సౌలభ్యం వల్ల దేశంలో 8 వేల చార్జింగ్ స్టేషన్ల వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దీనివల్ల యూజర్లకు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష సమాచారం లభిస్తుంది. అంతేకాదు ఈ వివరాలను చార్జర్ టైప్ ద్వారా ఫిల్టర్ చేసుకోవచ్చు. అంతేకాదు ద్విచక్ర విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల వివరాలు తెలుసుకునే సౌలభ్యాన్ని గూగుల్ తొలిసారిగా భారత్ లోనే అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రయాణికులకు ఉపయుక్తం

దేశంలో 10 పెద్ద పట్టణాలలో స్థానిక సంస్థలతో గూగుల్ జట్టు కట్టింది. ఈ ప్రాంతాలలో ఉన్న పర్యాటక స్థలాలను యూజర్లకు గూగుల్ సిఫారసు చేస్తుంది. స్థానిక నిపుణుల సహకారంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వివరాలను అందులో పొందుపరుస్తుంది. దీనివల్ల పర్యాటకంగా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా ఆయా మార్గాల మీద ఏవైనా ఘటనలు జరిగితే.. రిపోర్టు, షేర్ చేసే సదుపాయాన్ని గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల యూజర్లకు రవాణా సమస్యలు ఎదురు కాకుండా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐ ఓ ఎస్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే యూజర్లకు అందుబాటులో ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular