Gussadi Kanakaraja : ఆయన గుస్సాడీ గుండె చప్పుడు.. ఆయన పాదం కదిపితే ‘గిరి’ గూడెం చిందేస్తుంది. ఆయన ఆడితే గిరిజనమంతా కాలుకదుపుతారు. ఆయన గజ్జ కడితే వేడుక ఏదైనా సందడే. అంతరించిపోతున్న ఆదివాసీ నృత్యానికి ప్రాణం పోసిన కళాపోషకుడు. నృత్యం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుని, జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిన కళా సార్వభౌముడు గుస్సాడీ కనకరాజు(83). తాను నేర్చుకున్న ప్రాచీన కళను భావి తరాలకు అందించాలన్న లక్ష్యంతో వేలాది మంది ఆదివాసీలకు గుస్సాడీ శిక్షణ ఉచితంగా ఇచ్చారు. అంతరించిపోయే దశలో ఉన్న ఆదివాసీ కళకు ప్రాణంపోసి జాతీయ, అంతర్జాతీయస్థాయి గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. అందుకే ఆయన గుస్సాడీ రాజుగా కీర్తి గడించారు, తుది శ్వాస వరకూ గుస్సాడీ కళా పోషణలోనే ఉన్న పద్మశ్రీ కనకరాజు శుక్రవార రాత్రి 8:15 గంటలకు కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆస్తమాతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దనే తుది శ్వాస విడిచారు. దీపావళి నుంచి దండారీ ఉత్సవాలు ప్రారంభం అవుతున్న వేళ.. కనకరాజు మరణించడంతో ఆదివాసీ గూడేల్లో విషాదం నెలకొంది,
మార్లవాయిలో జననం
కనకరాజు కుముంభీం ఆసిఫాబాద్ జిల్లా మర్లవాయి గ్రామంలో రాము, రాజుబాయి దంపతులకు 1941లో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన చురుగ్గా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు. మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి దంపతులు మార్లవాయిలోనే ఉండేవారు. చిన్నతనం కనకరాజు వారివద్దే ఎక్కువ సమయం గడిపేవారు. కనక రాజుకు ఇద్దరు భార్యలు భీంబాయి, పార్వతీబాయి. ముగ్గురు కుమారులు రాము, తుకారాం, జుగాదిరావుతోపాటు ఎనిమిది మంది కుమార్తెలు ఉన్నారు. కనకరాజుకు చిన్నతనం నుంచి దీపావళి పర్వదినం సందర్భంగా ప్రారంభమయ్యే గుస్సాడీ ఉత్సవాల్లో పాల్గొనేవారు. దండారీల వెంట తిరుగుతూ గడిపేవాడు. మొదట ఆయన మార్లవాయిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రోజువారీగా కూలీగా విధులు నిర్వర్తించేవాడు. అలాగే నార్నూర్ మండలం జామడా, సిర్పూర్(యూ) మండలం కోహినూర్, ఉట్నూర్, మార్లవాయిల్లో దినసరి కూలీగా పనిచేశాడు. ప్రధానోపాధ్యాయులు చెప్పే పనులు చేస్తూనే యువకులు, విద్యార్థులకు గుస్సాడీ నృత్యంపై శిక్షణ అందించేవారు.
టీం లీడర్‌గా..
1981లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఆదివాసీ ఐఏఎస్ తుకారాం బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో గుస్సాడీ శిక్షణ తరగతులు నిర్వహించారు. 150 మంది శిక్షణ పొందారు. వీరిలో 35 మందిని ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శనకు పంపించారు. ఈబృందానికి కనకరాజు సారథ్యం వహించారు. ఎర్రకోట వద్ద ప్రదర్శించిన నృత్యంతో కనకరాజుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
గూడెం నుంచి ఢిల్లీ వరకు
ఇక ఎర్రకోట వద్ద ప్రదర్శించిన గుస్సాడీ నృత్య ప్రదర్శన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం ఇందిర స్వయంగా క నకరాజును పలకరించారు. తనకు గుస్సాడీ నృత్యం నేర్పించాలని కోరారు. దీంతో కనకరాజు కూడా ఇందిరకు నెమలి పింఛం అలంకరించి పాదాలకు గజ్జెలు కట్టి చేతికి దండారీ అందించి ఆమెతో నృత్యం చేయించారు. 2014లో కూడా కనకరాజుకు ఢిల్లీలో ప్రదర్శన ఇచ్చే అవకాశం దక్కింది. 2014లో గణతంత్ర వేడుకల సందర్భంగా మరోమారు గుస్సాడీ ప్రదర్శన ఇచ్చారు. ఈ సమయంలో నాటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఈ ప్రదర్శనను తిలకించారు. కనకరాజు బృందానికి ప్రశంసా పత్రాలు అందించారు. గుస్సాడీ కళను కాపాడేందుకు ఆయన చేసిన కృషికి గాను 2021లో కేంద్రం కనకరాజుకు దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ ప్రకటించింది. అదే ఏడాది నవంబర్ 9న అప్పటి రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్ పద్మశ్రీ ప్రదానం చేశారు. తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ పద్మశ్రీ అందుకున్న కనకరాజుకు రూ.కోటి ఆర్థికసాయంతోపాటు ఇంటి స్థలం కేటాయించారు.