Ghibli : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జీబ్లీ (Ghibli) స్టైల్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి ఏ ప్లాట్‌ఫామ్ ఓపెన్ చేసినా, యూజర్ల ఫీడ్‌లు ఈ యానిమేటెడ్ చిత్రాలతో నిండిపోతున్నాయి. ఇది ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్న సరికొత్త ట్రెండ్‌గా మారింది.ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల తమ చాట్‌జీపీటీలో జీబ్లీ స్టూడియో ఫీచర్‌ను ప్రవేశపెట్టడంతో ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంది. నెటిజన్లు ఈ సదుపాయాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దేశాధినేతలు, ప్రముఖ నాయకుల చిత్రాలకు యానిమేషన్ రూపాన్నిస్తూ, వాటిని కార్టూన్ తరహా ఫొటోలుగా మారుస్తున్నారు. ఈ ఫీచర్‌ను ఉపయోగించి మీరు కూడా ఎలాంటి సభ్యత్వం లేకుండా ఉచితంగా ఇటువంటి ఇమేజ్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.
Also Read : రూ.599 కే విమాన ప్రయాణం.. వివరాలు ఏంటో తెలుసుకోండి..
ఓపెన్ ఏఐ మొదట్లో ఈ జీబ్లీ ఫీచర్‌ను ఉచితంగా అందించింది. అయితే, ఒక్కసారిగా వినియోగం పెరగడంతో తమ జీపీయూపై అధిక భారం పడుతోందని భావించి, దీనిపై పరిమితులు విధించింది. ప్రస్తుతం రోజుకు కేవలం మూడు ఫొటోలను మాత్రమే ఉచితంగా యానిమేషన్ రూపంలో మార్చే అవకాశం కల్పిస్తోంది. అయితే, చాట్‌జీపీటీ ప్లస్, ప్రో, టీమ్ సబ్‌స్క్రైబర్‌లకు మాత్రం ఈ సదుపాయం ఉచితంగా అందుబాటులో ఉంది.
చాట్‌జీపీటీ లేటెస్ట్ వెర్షన్‌లోకి వెళ్లి, మీకు కావలసిన ఇమేజ్‌ను “జీబ్లీఫై” అని లేదా “జీబ్లీ థీమ్‌లోకి మార్చమని” ప్రాంప్ట్ ఇస్తే, వెంటనే ఆ ఇమేజ్‌ను జీబ్లీ స్టైల్‌లోకి మార్చి మీకు అందిస్తుంది. ఈ ట్రెండ్ విస్తృత ప్రజాదరణను గమనించిన ఇతర ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లు కూడా ఇదే విధమైన సదుపాయాన్ని అందిస్తున్నాయి. గూగుల్ ఏఐ ప్లాట్‌ఫామ్ జెమినీ సహాయంతో మీరు ఉచితంగా అపరిమిత సంఖ్యలో జీబ్లీ ఇమేజ్‌లను రూపొందించవచ్చు. జెమినీ ఏఐ ప్లాట్‌ఫామ్‌లో లాగిన్ అయిన తర్వాత, చాట్ బాక్స్‌లోకి వెళ్లి మీరు ఏ ఇమేజ్‌ని క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి క్లుప్తంగా ప్రాంప్ట్ ఇవ్వండి. తర్వాత “జీబ్లీ స్టైల్ ఇమేజ్‌ని రూపొందించమని” ఆదేశించండి. అంతే, క్షణాల్లో మీ ముందు జీబ్లీ తరహా చిత్రాలు ప్రత్యక్షమవుతాయి. దీని ద్వారా మీరు ఎన్ని ఫొటోలైనా ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు.
ఎక్స్‌కు చెందిన ఏఐ ప్లాట్‌ఫార్మ్ గ్రోక్‌లో లాగిన్ అయిన తర్వాత, ఇమేజ్ ఆప్షన్‌ను ఉపయోగించి మీకు నచ్చిన ఫొటోను ఎంచుకుని అప్‌లోడ్ చేయాలి. తర్వాత “జీబ్లీ ఫై దిస్ ఇమేజ్” అని చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు. గ్రోక్ వెంటనే ఆ ఫొటోను యానిమేట్ చేసి మీకు అందిస్తుంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫార్మ్ మనం స్వయంగా ఫొటోను అందిస్తేనే దానిని యానిమేట్ చేసి పంపుతోంది. ఈ విధంగా, వివిధ ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లను ఉపయోగించి మీరు కూడా మీ సాధారణ ఫొటోలకు జీబ్లీ స్టూడియో ప్రత్యేకమైన కార్టూన్ టచ్‌ని ఉచితంగా ఇవ్వవచ్చు.
Also Read : ఎలన్ మస్క్ ఏఐ గ్రోక్ లో ఊహించని ఫీచర్