Viral Video : విమానాలు, హెలికాప్టర్లు పాత మాట. వాటి స్థానంలో ఇప్పుడు డ్రోన్లు వచ్చాయి. పెరిగిన సాంకేతికతను అందిపుచ్చుకొని అనేక పనులు చేస్తున్నాయి. యుద్ధ రంగంలో పేలోడ్లను మోసుకెళ్ళడం నుంచి సరుకు రవాణా వరకు అన్ని పనులు దర్జాగా చేసేస్తున్నాయి. తాజాగా డ్రోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడి సరికొత్త విధానాలను అనుసరించి.. వివిధ రకాల పనులు చేయిస్తున్నారు సాంకేతిక నిపుణులు.. ఆ మధ్య విజయవాడలో వరదలు వచ్చినప్పుడు డ్రోన్ ద్వారానే సరుకులు రవాణా చేయించారు. మందులు కూడా వాటి ద్వారానే సరఫరా చేశారు. చివరికి పారిశుద్ధ్య పనులు కూడా వాటి ద్వారానే చేపట్టారు. మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు డ్రోన్లను పంపించి.. క్లిష్టమైన పనులను చేపట్టారు. అందువల్లే విజయవాడ నగరం త్వరగా వరద నుంచి కోలుకుంది. ఆ మధ్య గుంటూరు జిల్లాలోని మారుమూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డ్రోన్ ద్వారా మందులు పంపించారు. అనంతరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి ప్రాంతంలో డ్రోన్ షో కూడా నిర్వహించారు. ఇవన్నీ కూడా భవిష్యత్తు కాలం మొత్తం డ్రోన్లదేనని నిరూపిస్తున్నాయి.
మనుషులను మోసే విధంగా..
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన 12వ తరగతి విద్యార్థి మేదాన్ష్ త్రివేది.. చిన్నప్పటినుంచి చదువులో చాలా చురుకు. ఏదైనా ఒకటి కొత్త వస్తువును కనిపెట్టాలనే ఆలోచన అతడిలో మెండుగా ఉంటుంది. అందువల్లే చిన్నప్పటినుంచి అతడి మేధస్సు మొత్తం తయారీ మీదనే కేంద్రీకృతమై ఉంది. అయితే ఆ విద్యార్థి చైనా సాంకేతిక నిపుణులు చేస్తున్న ప్రయోగాలు చూసి ప్రేరణ పొందాడు. ఏకంగా మనుషులను మోసుకెళ్లగలిగే డ్రోన్ తయారు చేశాడు. దానికి mldt 01 అనే పేరు పెట్టాడు. ఇది గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. 80 కిలోల బరువు గల వ్యక్తిని ఆరు నిమిషాల పాటు గాల్లో మోస్తుంది. 3.5 లక్షలు ఖర్చు చేసి.. మూడు నెలల పాటు తీవ్రంగా శ్రమించి.. అతడు ఈ డ్రోన్ తయారు చేశాడు..” చిన్నప్పటి నుంచి నాకు ప్రయోగాలంటే చాలా ఇష్టం. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలను పరిశీలిస్తాను. అందులో నేను చేయగలిగే అంశాలను ఎంచుకుంటాను. ఈ డ్రోన్ తయారు చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీనిని ఇప్పటితోనే నిలిపివేయలేను. భవిష్యత్తు కాలంలో మరిన్ని ప్రయోగాలు చేస్తాను. డ్రోన్ తయారీలో సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరిన్ని ప్రయోగాలు చేసి.. ఎక్కువ బరువు మోయగలిగి.. ఎక్కువ దూరం ప్రయాణించగలిగేలా డ్రోన్లను తయారు చేయాలని ఉందని” మేదాన్ష్ చెబుతున్నాడు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన 12వ తరగతి విద్యార్థి మేధాన్ష్ త్రివేది మనుషులను మోసుకెళ్ళే డ్రోన్ MLDT 01 తయారు చేశాడు. ఇది 80 కిలోల బరువు ఉన్న వ్యక్తిని ఆరు నిమిషాల పాటు గాల్లో మోయగలుగుతుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. #MadhyaPradesh#drones pic.twitter.com/dd22ZPTSXo
— Anabothula Bhaskar (@AnabothulaB) December 11, 2024