Homeలైఫ్ స్టైల్Chandrayaan-3: చంద్రయాన్-3.. చంద్రుడి దక్షిణ దృవంపైనే ఎందుకు దించుతున్నారు?

Chandrayaan-3: చంద్రయాన్-3.. చంద్రుడి దక్షిణ దృవంపైనే ఎందుకు దించుతున్నారు?

Chandrayaan-3: చంద్రుడు.. భూమి చుట్టూ తిరుగుతాడు. పున్నమి వేళ తెల్లగా వెలుగుతాడు. చల్లదనాన్ని పంచుతాడు. అలాంటి చందమామ మీద మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.. విప్పాల్సిన గుట్టు మట్లు చాలానే ఉన్నాయి. వాటంన్నింటినీ కనుగొనేందుకు ఇస్రో రెడీ అయింది. చంద్రయాన్_3 ద్వారా శుక్రవారం చంద్రుడి పైకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఎల్వీఎం_3ఎం4 రాకెట్ ద్వారా పైకి ఎగరనుంది. చంద్రయాన్_2 ప్రాజెక్టుకు కొనసాగింపుగా ఇస్రో ఈ మిషన్ చేపడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది గురి తప్పకూడదన్న పట్టుదలతో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు.. అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రయోగానికి మేం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇస్రో దృష్టి చంద్రుడి మీద ఉంటే.. ప్రపంచం దృష్టి భారత్ మీద ఉంది.

ఎందుకు ఈ ప్రయోగం అంటే..

చంద్రయాన్ _3 చంద్రుడిపై అధ్యయనం చేయడమే కాదు.. ఇతర గ్రహాలపై జీవాన్ని కనుగొనడంలో సహాయపడుతుంది..ఎల్వీఎం _3ఎం4 రాకెట్ ద్వారా నింగిలోకి ఎగిరే చంద్రయాన్_3 సుదీర్ఘ ప్రయాణం అనంతరం ఆగస్టు నెలలో చంద్రుడి దక్షిణ దృవం చేరుతుంది. అనంతరం అందులోని ల్యాడర్, రోవర్ చంద్రుడి ఉపరితలంపై దిగి అన్వేషణ కొనసాగిస్తాయి.. చంద్రుడి మీద నీటి జాడలు ఉన్న నేపథ్యంలో ఇస్రో దక్షిణ ధ్రువాన్ని ఎంచుకున్నది. ఆ ప్రాంతంలో మంచు స్పటికల రూపంలో నీళ్ల నిల్వలు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన ప్రయోగంలో నాసా కూడా దానిని ధ్రువీకరించింది. నాసా అంచనా ప్రకారం అక్కడ దాదాపు 10 కోట్ల టన్నుల మేర నీటి నిల్వలు ఉండవచ్చు. నీరు ఉన్నచోట మనిషి జీవించగలడు. ఫలితంగా ఇది చంద్రుడి మీద భవిష్యత్తు పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అన్ని సవ్యంగా జరిగితే ఆగస్టు 23 లేదా 24న ల్యాండర్, రోవర్ చంద్రుని దక్షిణ ధ్రువం పై దిగుతాయి. ఇక్కడ అవి ఒక మూన్ డే (అంటే భూ పై 14 రోజులకు సమానం) పాటు పరిశోధన చేస్తాయి.

నాలుగేళ్ల క్రితం

ఇస్రో చేపట్టిన చంద్రయాన్_2 మిషన్ చివరి నిమిషంలో విఫలమైంది. ఇది జరిగి నాలుగు సంవత్సరాలు అయింది. మరి కొద్ది సేపట్లో చంద్రుడిపై దిగుతుందనగా ల్యాండర్ కుప్పకూలింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా చేపడుతున్న చంద్రయన్_3 కోసం ఇస్రో పకడ్బందీగా సిద్ధమైంది. “వైఫల్యాలనుంచి పాఠాలు నేర్చుకున్నాం. చంద్రయాన్ 2 తో పోల్చితే చంద్రయాన్_3 లో ల్యాండర్ ను మరింత బలంగా రూపొందించాం. మరిన్ని భద్రతా చర్యలు తీసుకున్నాం” అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. కాగా చంద్రయాన్_3 కోసం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో కౌంట్ డౌన్ మొదలైంది. ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం బుధవారం నిర్వహించారు. శ్రీహరికోట డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమైంది. ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్ కు తుది పరీక్షలు నిర్వహించి అన్ని సజావుగానే పనిచేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్ష రంగంలో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించిన ఇస్రో చంద్రునిపై మరిన్ని పరిశోధనలు చేయడానికి మూడోసారి జాబిల్లి యాత్రకు సిద్ధమైంది.

బాహుబలి

ఇస్రో అభివృద్ధి చేసిన రాకెట్లలో అత్యంత శక్తివంతమైనది ఎల్వీఎం 3. గతంలో దీనిని జిఎస్ఎల్వి మార్క్ 3 అని పిలిచేవారు. ఇది ఒక బాహుబలి రాకెట్. దీని బరువు 640 టన్నులు. ఇది భారీ స్థాయిలో పేలోడ్లను సులువుగా మోసుకెళ్లగలదు. కాబట్టి చంద్రయాన్_3 మిషన్ కు ఇస్రో ఈ రాకెట్ ని ఎంచుకుంది. సుమారు 3900 కిలోల పేలోడ్ తో ఉన్న చంద్రయాన్_3 ని ఎల్విఎం 3 రాకెట్ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టనుంది. ఎల్వీఎం_3 ద్వారా ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన మూడు ప్రయోగాలు విజయవంతమయ్యాయి. చంద్రయాన్_3 నాలుగో ప్రయోగం.

చరిత్ర సృష్టించేందుకు

నాలుగు సంవత్సరాల క్రితం కోట్లాదిమంది భారతీయులను నిరాశకు గురి చేసిన ఇస్రో… తన మూడవ మూన్ మిషన్ చంద్రయాన్ 3 తో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత రికార్డు కొలుపుతుంది. అమెరికా, రష్యా, చైనా ఇప్పటికే ఈ ఘనతలు సాధించాయి. ఆ జాబితాలోకి ఇప్పుడు భారత్ కూడా వచ్చి చేరుతుంది. 2019లో జరిగిన వైఫల్యం దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా ఫెయిల్ సేఫ్ విధానంలో ఇస్రో చంద్రయాన్ 3ని రూపొందించింది. ఈ మిషన్ లో స్వదేశీ ప్రొఫల్షన్ మాడ్యూల్, ల్యాండర్ రోవర్ ఉన్నాయి. వీటిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఇస్రో ఈ ప్రయోగం చేస్తున్న నేపథ్యంలో దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. గత ప్రయోగం విఫలమైన నేపథ్యంలో ఈసారి విజయవంతం కావాలని కోరుకుంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version