DGCA AirCraft : ఈ మానవ రహిత విమానం నెట్ట నిలువుగా టేక్ ఆఫ్ అవుతుంది. భూమి మీదకు దిగుతుంది. దీనిని “వీటివోఎల్” అని పిలుస్తున్నారు. దీనిని సరుకు రవాణాకు ఉపయోగిస్తారట. ఈ విమానాన్ని బ్లూజే తెరో స్పేస్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ విమానాన్ని హైదరాబాదులోని నాదర్గుల్ ఎయిర్ ఫీల్డ్ లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. 2026 నాటికి వాణిజ్యపరంగా ఈ విమానాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తారట. ఇదే విషయాన్ని బ్లూ జే ఏరో సంస్థ కో ఫౌండర్లు అమర్దీప్, ఉత్తంకుమార్ వివరించారు. 100 కిలోల బరువు ఉన్న సరుకును ఈ విమానం 300 కిలోమీటర్ల దూరం వరకు మోసుకెళ్తుంది. వరదలు, ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ విమానం ద్వారా సరుకులను వేగంగా రవాణా చేయవచ్చు.
30 నిమిషాల వ్యవధిలోనే ..
ఈ విమానం హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు కేవలం 30 నిమిషాలలోనే చేరుకుంటుంది. గ్రామీణ ప్రాంతాలలో సరుకు రవాణా చేయడానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే 2026 నాటికి హైడ్రోజన్ విద్యుత్ ప్రొఫెల్షన్ తో నడిచే అటానమస్ ఫ్లైట్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతోంది. అంతేకాదు దానిద్వారా మనుషులను కూడా రవాణా చేయగలిగే వీటీవోఎల్ విమానాన్ని కూడా ఆవిష్కరిస్తామని వివరిస్తోంది. అయితే విమానాశ్రయాలు లేని.. విమాన సౌకర్యం లేని ప్రాంతాలకు సేవలు అందించడం దీని ద్వారా వీలవుతుందని ఆ సంస్థ చెబుతోంది. హైదరాబాద్ కేంద్రంగా 2022లో ఈ సంస్థ స్టార్టప్ మోడ్ లో తన సేవలను ప్రారంభించింది. ఇప్పటివరకు 18 కోట్లను పెట్టుబడుల రూపంలో సమీకరించింది.. రైన్ మ్యాటర్ క్యాపిటల్, జెరోదా, ఇండియా క్యాపిటల్, ఐడియా స్ప్రింగ్ క్యాపిటల్ వంటి సంస్థలు ఈ నగదును అందించేందుకు ముందుకు వచ్చాయి.. సిరీస్ ఏ ఫండింగ్ లో భాగంగా వచ్చే మూడు సంవత్సరాలలో 250 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకోవడానికి తమ ప్రయత్నిస్తున్నామని బ్లూ జే సంస్థ చెబుతోంది. రక్షణ అవసరాల కోసం.. ఎత్తైన ప్రాంతాలలో విశిష్టమైన సేవలు అందించేందుకు త్వరలో ఒక విమానాన్ని రూపొందిస్తామని ఆ సంస్థ వివరిస్తోంది. సైనికులకు నిత్యావసరాలు, సమస్యాత్మక ప్రాంతాలలో సరుకుల రవాణా ఈ విమానాల ద్వారా చేపట్టవచ్చని చెబుతోంది. ఇటీవల కాలంలో మానవ రహిత విమానాల తయారీ ఊపందుకుంది. పలు సంస్థలు ఇందులో పెట్టుబడులు పెడుతున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్టార్టప్ కంపెనీలు ఏర్పడి వీటిని తయారు చేస్తున్నాయి. భవిష్యత్తు కాలంలో వీటికి డిమాండ్ ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందువల్లే వీటి తయారీకి ఆసక్తిని చూపిస్తున్నాయి. పలు వేదికల వద్ద వీటిని ప్రదర్శిస్తున్నాయి.