https://oktelugu.com/

Astronaut Sunita Williams: అంతరిక్షంలోకి సునీత.. ఈసారి ఏం చేస్తుందంటే?

ప్రపంచంలో అతిపెద్ద ఏరో స్పేస్‌ కంపెనీల్లో ఒకటైన బోయింగ్‌ కూడా తాజాగా సీఎస్టీ–100 స్టార్‌లైన్‌ పేరుతో వ్యోమనౌక తయారు చేసింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 5, 2024 / 12:12 PM IST

    Astronaut Sunita Williams

    Follow us on

    Astronaut Sunita Williams: అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు అన్నింట్లో ఇక ప్రైవేటు జెట్‌ల హవా కొనసాగనునుంది. ఇప్పటికే అమెరికా 30 ఏళ్లు సాగించిన స్పేస్‌ షటిల్స్‌ శకం 2011లో ముగిసింది. రష్యా కూడా టూరిస్టు టికెట్లు అమ్ముతోంది. ఈ నేపథ్యంలో రెండు ప్రైవేటు స్పేస్‌ జెట్ల అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. అందులో ఒకటి ఎక్స్, టెస్లాల యజమాని ఎలాన్‌మస్క్‌ రూపొందించిన స్పేస్‌ ఎక్స్‌ రూపొందించిన క్రూ డ్రాగన్‌ కేప్సుల్‌ ఒకటి. ఇప్పటికే ఫాల్కన్‌ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతోపాటు వ్యోమగాములను చేరవేస్తోంది.

    బోయింగ్‌ కూడా..
    ప్రపంచంలో అతిపెద్ద ఏరో స్పేస్‌ కంపెనీల్లో ఒకటైన బోయింగ్‌ కూడా తాజాగా సీఎస్టీ–100 స్టార్‌లైన్‌ పేరుతో వ్యోమనౌక తయారు చేసింది. మే 6న ఇది మానవ సహిత యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలు ఉన్న అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ముచ్చటగా మూడోసారి ఈ అంతరిక్ష నౌకద్వారా స్పేస్‌లోకి వెళ్లబోతుండడం మరో విశేషం.

    సునీత హ్యాట్రిక్‌..
    సునీత విలియమ్స్‌.. ఇండియన్, అమెరికన్‌ అస్ట్రోనాట్‌. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం తర్వాత 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసీకి వెళ్లబోతున్నారు. అమెరికన్‌ నేవీ కెప్టెన్‌(రిటైర్డ్‌) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్‌ అమెరికన్‌ దీపక్‌ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్‌ బోనీ స్లోవేన్‌–అమెరికన్‌. సునీత 1965లో అమెరికాలో జన్మించారు.

    6న అంతరిక్షంలోకి..
    యూనైటెడ్‌ లాంచ్‌ అలయెన్స్‌ రాకెట్‌ అట్లాస్‌–5 శీర్షిక భారగంలో అమర్చిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34(భారత కాలమానం ప్రకారం) గంటలకు ఫ్లోరిడాలోని కేప్‌ కెనవరల్‌ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. ఐఎస్‌ఎస్‌లో వీరు వారం పాటు ఉంటారు. సునీత 2006, డిసెంబర్‌ 9న తొలిసారి ఐఎస్‌ఎస్‌కు వెళ్లారు. 2007, జూన్‌ 22 వరకు రోదసీలో గడిపారు. నాలుగుసార్లు స్పేస్‌ వాక్‌ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొప్పారు. రెండోసారి 2012, జూలై 13 నుంచి 127 రోజులు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. మూడుసార్లు స్పేస్‌వాక్‌ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్‌వాక్‌ చేశారు.