Artificial Intelligence Jobs: ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్.. సాంకేతిక ప్రపంచంలో వచ్చిన టెక్నాలజీ ఇది. ఈ టెక్నాలజీ వల్ల సాంకేతిక ప్రపంచంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించడంతో సరికొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతున్నాయి. పనులు కూడా అత్యంత వేగంగా సాగిపోతున్నాయి. ఒకప్పుడు మానవ వనరులను ఉపయోగించి చేసిన పని.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తున్నారు.
Also Read గౌతమ్ గంభీర్ చూస్తుండగానే.. కోచ్ మీద పడి టీమిండియా ప్లేయర్ల కొట్లాట.. షాకింగ్ వీడియో
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఐటి పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమవుతోంది. సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో మ్యాన్ పవర్ అవసరం లేకుండా పోతోంది. దీనికి తోడు ఐటీ కంపెనీల సేవలకు గిరాకీ ఒకప్పటిలాగా లేకపోవడంతో.. ఉద్యోగుల కొరత అనివార్యంగా మారుతున్నది. ఇదే అదునుగా కంపెనీలు అడ్డగోలుగా ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. గడచిన రెండు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. భవిష్యత్ కాలంలో కూడా ఉద్యోగాల కోత విపరీతంగా ఉంటుందని కంపెనీల అధినేతలు సంకేతాలు పంపిస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఐటీ లోని కొన్ని రంగాలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. గిరాకీ లేకపోవడంతో ఈ రంగాలలో ఉద్యోగులను కంపెనీలు తొలగించడం మొదలుపెట్టాయి. దీనికి తోడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉద్యోగులు మారాల్సి ఉందని కంపెనీలు సంకేతాలు ఇస్తున్నాయి.
ఈ స్థాయిలో ఉద్యోగాలు పోవడానికి కారణం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అని ఉద్యోగులు భావిస్తున్నారు. అంతేకాదు మాన్యువల్ గా చేసే ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని వారు పేర్కొంటున్నారు.. అయితే ఒక అంచనా ప్రకారం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కాదు.. అంతకుమించి టెక్నాలజీ వచ్చినా ఉద్యోగాలు పోవని.. పైగా కొత్త ఉద్యోగాలు వస్తాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అయితే నిపుణులు చేస్తున్న ఈ విశ్లేషణను కొంతమంది ఐటీ ఉద్యోగులు సానుకూలంగా తీసుకోలేకపోతున్నారు.
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పోతున్నాయి అనేది కఠిన వాస్తవం. అయితే అదే సమయంలో కొత్త ఉద్యోగాల సృష్టి కూడా జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడం వల్ల కోడింగ్ విభాగంలో పని చేసేవారు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఎందుకంటే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా కోడింగ్ అనేది సులభతరం అవుతున్నది. దీంతో ఆ విభాగంలో పనిచేసే వారంతా రోడ్డున పడుతున్నారు. అయితే కోడింగ్ లో పనిచేస్తున్న మెజారిటీ ఉద్యోగులు తమ కెరియర్ ప్రారంభంలో ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఆ రంగంలో వారు గనక తమ నైపుణ్యాన్ని పెంచుకుంటే పరిస్థితి ఈరోజు ఇలా ఉండేది కాదు.. వారి ఉద్యోగాలకు ఇబ్బంది ఉండేది కాదు.. పైగా వారికి భారీగా వేతనం ఇచ్చి సంస్థలు ఉంచుకునేవి. మారుతున్న పరిస్థితి కనుగుణంగా ఉద్యోగులు కూడా తమ స్కిల్స్ పెంచుకొని ఉంటే బాగుండేది.
వాస్తవానికి టెక్నాలజీ పెరిగినప్పుడు అన్ని రంగాలలో మార్పులు వస్తుంటాయి. అయితే టెక్నాలజీ అనేది ఎవరికీ ఉచితంగా లభించదు. టెక్నాలజీని ఉచితంగా అందించడానికి కంపెనీలు సత్రాలు నడపడం లేదు. ఈ టెక్నాలజీ మీద కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టి ఉంటాయి. ఈ టెక్నాలజీ నడవాలి అంటే కచ్చితంగా ఉద్యోగుల అవసరం ఉంటుంది. పైగా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అనేది అత్యంత ఖరీదైన టెక్నాలజీ. దీనిని వాడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. ఇప్పుడు వినిపిస్తున్న కథనాల ప్రకారం ఉద్యోగాలు పోతే ఆ టెక్నాలజీని ఎవరు కొనుగోలు చేస్తారు? ఎందుకు ఉపయోగిస్తారు? ఆదాయం ఉంటేనే కదా కొనుగోలు జరిగేది. కొనుగోలు లేకుంటే కంపెనీలకు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? పెట్టిన పెట్టుబడులు ఏ రూపంలో లభిస్తాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషుల సహకారం లేకుండా నడిచే టెక్నాలజీ కాదు.. కాకపోతే ఆ టెక్నాలజీలో మనుషులు దానికి అనుగుణంగా పనిచేయాలి. అప్పుడే ఆ టెక్నాలజీ ద్వారా సేవలు లభిస్తాయి.
ప్రస్తుతం టెక్నాలజీ మారిపోతోంది.. దానికి తగ్గట్టుగా ఉద్యోగులు మారాలి. తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలి. మారుతున్న అవసరాలకు అనుగుణంగా వారు కూడా పనిచేయగలగాలి. అలా పనిమీద పట్టు సాధించినప్పుడే వారి ఉద్యోగానికి భరోసా ఉంటుంది. భవిష్యత్తు కాలం కూడా భద్రంగా ఉంటుంది. అలాకాకుండా.. ఎక్కడ మొదలుపెట్టామో.. అలానే ఉంటామంటే కుదరదు. అన్నింటికంటే టెక్నాలజీ రంగంలో అలా ఉండడం అసలు సాధ్యం కాదు.