సోషల్ మీడియాలో వాట్సాప్ సృష్టించిన సంచలనం మామూలుది కాదు. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్ విశేషమైన ఆదరణ పొందింది. బిలియన్ల యూజర్లతో సరికొత్త సంచలనాలు నమోదు చేస్తోంది. అభివృద్ధి చెందిన అమెరికా నుంచి మొదలుపెడితే అట్టడుగు ఆఫ్రికా వరకు ప్రతి దేశంలోనూ ఈ యాప్ వాడుతున్నారు. ఈ యాప్ ద్వారా ప్రభుత్వాలు గవర్నింగ్ సర్వీసులు కూడా అందిస్తున్నాయి. ఫోటోల నుంచి మొదలు పెడితే వీడియోల వరకు ప్రతిదీ దీని ద్వారా పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి.. దీనికి విపరీతమైన ఆదరణ దక్కుతోంది.
కృత్రిమ మేధ అందుబాటులోకి రావడంతో ఈ యాప్ సరికొత్తగా కనిపిస్తోంది. వీడియోలు రూపొందించడం.. ఫోటోలు సృష్టించడం.. తెలియని విషయాలను తెలుసుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే వాట్సాప్ ద్వారా ఎన్నో పనులు జరుగుతున్నాయి.. భవిష్యత్తు కాలంలో ఈ యాప్ ఇంకా సమూల మార్పులకు కారణమయ్యే అవకాశం ఉంది. కృత్రిమ మేధ ద్వారా వాట్స్అప్ ను ఇంకా మార్చాలని మెటా కంపెనీ భావిస్తోంది. వాస్తవానికి ఇప్పటివరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇకపై వాట్సప్ కు గట్టి పోటీ ఎదురుకానుంది. వాట్సప్ కు అతిపెద్ద వినియోగదారులు ఉన్న ఇండియా నుంచి ప్రతిఘటన ఎదురుకానుంది.
అమెరికా టారిఫ్ విధానాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రావాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జోహో అనే తమిళనాడుకు చెందిన కంపెనీ Arattai అనే మెసేజింగ్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని అర్థం సాధారణ సంభాషణ అని. దీనికి ప్రతిరోజు మూడు లక్షల మంది కొత్త యూజర్లు నమోదు అవుతున్నారు. జోహో లో చీఫ్ సైంటిస్ట్ గా శ్రీధర్ నెంబు కొనసాగుతున్నారు. “కృత్రిమ మేధ ఆధారంగా ఈ యాప్ లో రకరకాల డెవలప్ లు చేస్తున్నాం. రోజుకు కొత్తగా మూడు లక్షల మంది యూజర్లు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. భిన్నంగా సేవలు అందిస్తున్నాం. ఇంకా కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. ఏదైనా సరే మా వంతుగా భిన్నమైన ప్రపంచాన్ని సృష్టిస్తాం. ఇది ఇండియన్ కంపెనీ రూపొందించింది కాబట్టి భారతీయుల ఆదరణ లభిస్తుందని భావిస్తున్నామని” శ్రీధర్ నెంబు పేర్కొన్నారు.