Suryakumar Yadav donation: మామూలుగానే సూర్యకుమార్ యాదవ్ మైదానంలో తీవ్రమైన టెంపర్మెంట్ లో ఉంటాడు. ఏ దశలోనూ టీమిండియా ఓడిపోవడాన్ని ఒప్పుకోడు. పైగా తనకు మాత్రమే సాధ్యమైన నాయకత్వంతో అదరగొడుతుంటాడు. అవకాశాలు లేనిచోట సృష్టించుకుంటాడు. ఉన్న వాటిని మరింత బలోపేతం చేసుకుంటాడు. అందువల్లే అతని నాయకత్వంలో టీమిండియా వరుస విజయాలు సాధిస్తోంది. తద్వారా టి20 ఫార్మాట్ లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
ఆసియా కప్ లో లీగ్ దశలో పాకిస్తాన్ జట్టు మీద సూర్య కుమార్ యాదవ్ 47 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆ స్థాయిలో ఆడ లేకపోయాడు. ఆటగాడిగా విఫలమైనప్పటికీ నాయకుడిగా మాత్రం విజయవంతమయ్యాడు. జట్టును నడిపించడంలో అద్భుతమైన ప్రతిభ చూపించాడు. దీంతో మిగతా ఫార్మాట్ లలోనూ అతడికి నాయకత్వ పగ్గాలు లభిస్తాయని ప్రచారం జరుగుతోంది.. మరోవైపు టి20 వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో టీమిండియా ఆసియా కప్ గెలపొందడం పట్ల అభిమానుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. వచ్చే టోర్నీలో కూడా అదే స్థాయిలో ప్రతిభ చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
జట్టన్నా.. దేశమన్నా.. సైనికులన్నా సూర్య కుమార్ యాదవ్ కు విపరీతమైన ఇష్టం. అందువల్లే అతడు సైన్యాన్ని కీర్తిస్తుంటాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సైన్యం చూపించిన పటిమను కొనియాడాడు. అంతేకాదు పాకిస్తాన్ జట్టు పై మూడు పర్యాయాలు విజయం సాధించినప్పటికీ ఆ జట్టు ప్లేయర్లకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. చివరికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి నుంచి ఆసియా కప్ అందుకోలేదు. దీంతో సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు మరో నిర్ణయం కూడా సూర్యకుమార్ యాదవ్ తీసుకున్నాడు. ఆసియా కప్ లో తన ఏడు మ్యాచ్ల ఫీజు ను భారత సోల్జర్లకు ఇస్తున్నటు ప్రకటించాడు. వారి పోరాటం వల్లే దేశం ఇలా ఉందని వ్యాఖ్యానించాడు. సూర్య కుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం పట్ల అందరిలోనూ హర్షం వ్యక్తమవుతోంది. ఇటువంటి నాయకుడు కదా ఉండాల్సింది జట్టులో అంటూ ప్రశంస లభిస్తోంది.