Apple and Google Deal : ప్రపంచంలోనే అత్యధిక మంది వాడే సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్’. ఇక ప్రపంచంలోనే అత్యధిక మంది కొనే ఫోన్ ‘ఐఫోన్’. ఈ రెండు టెక్ దిగ్గజాలు వ్యాపార రంగంలో పోటీ పడుతుంటాయి. గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేయగా.. యాపిల్ తన ‘ఐవోఎస్’ను డెవలప్ చేసింది. అయితే ఈ రెండూ పోటీపడుతున్నా అంతర్గతం ఒకరి నొకరు సహకరించుకుంటూ తమ ఆధిపత్యం కోసం డబ్బులు చెల్లించుకుంటున్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక మంది వాడే ఐఫోన్ లో ఇంటర్నెట్ శోధనకు యాపిల్ తయారు చేసిన ‘సఫారీ’నే ఓపెన్ అవుతుంది. అందులో క్రోమ్ ఇన్ బిల్ట్ గా ఉండదు. సఫారీలో డిఫాల్ట్ ఎంపికగా ఉండటానికి గూగుల్ సెర్చ్ ఇంజిన్ భారీగా డబ్బులు చెల్లిస్తోంది. గూగుల్ చెల్లించినంత కాలం యాపిల్ దాని స్వంత ఇంటర్నెట్ శోధన ఇంజిన్‌ను అభివృద్ధి చేయదని గూగుల్ నమ్ముతోంది. తద్వారా తమ ఆధిపత్యానికి చెక్ పడదని ఈ భారీ మొత్తాలను యాపిల్ కు ఇస్తున్నట్టు తెలుస్తోంది. యాపిల్-గూగుల్ ఈ ఒప్పందాన్ని చేసుకున్నాయి. యాపిల్ ఫోన్ లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇన్ బిల్ట్ గా రావడానికి దాదాపు 15 బిలియన్ డాలర్లను గూగుల్ స్వయంగా యాపిల్ కు చెల్లిస్తోందని సమాచారం. ఇంటర్నెట్ సెర్చింజన్ వ్యాపారంలో ఈ రెండు కంపెనీలు పోటీ లేని ఒప్పందాన్ని కలిగి ఉన్నాయని ఆరోపణలున్నాయి.
ముఖ్యంగా, యాపిల్ సీఈవో టిమ్ కుక్ మరియు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ “సాధారణ రహస్య సమావేశాలలో” పాల్గొన్నారని అభియోగాలు ఉన్నాయి. దీనిలో ఐఫోన్ మరియు ఐపాడ్ వంటి పరికరాలకు ప్రాధాన్యతనిస్తే యాపిల్ తో దాని లాభాలను పంచుకోవడానికి గూగుల్ అంగీకరిస్తుంది.
ఆపిల్ తన స్వంత పోటీ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించదు అనే ఒప్పందం ఆధారంగా యాపిల్ కు వార్షిక బహుళ-బిలియన్-డాలర్ చెల్లింపులను గూగుల్ చెల్లిస్తుందని తెలిసింది. ఈ ఒప్పందంలో గూగుల్ కు పోటీదారులను అణిచివేసేందుకు..ఇతర సెర్చింజన్ లో యాపిల్ ఫోన్ లో రాకుండా ఈ ఒప్పందం చేసుకున్నారని తెలిసింది.
యాపిల్ పరికరాలలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా గూగుల్ స్థానాన్ని ఉంచేందుకు యాపిల్ మరియు గూగుల్ మధ్య బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగిందన్నది రహస్యం కాదు. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇతర దేశాల్లోని యాపిల్ పరికరాలలో డిఫాల్ట్ శోధన ఇంజిన్‌గా ఉండటానికి గూగుల్ ఉంటోంది. దీనికోసం ఎంత చెల్లిస్తుందో ఏ కంపెనీ కూడా ధృవీకరించలేదు. అయితే దీని విలువ 15 బిలియన్‌లుగా ఉంటుందని తాజాగా తేలింది.
2020లో ది న్యూ యార్క్ టైమ్స్ తన పరికరాలలో గూగుల్ ని డిఫాల్ట్ శోధనగా మార్చడానికి బదులుగా యాపిల్ సంవత్సరానికి $8-12 బిలియన్లను తీసుకుంటోందని నివేదించింది. ఇప్పుడది 15 బిలియన్లకు చేరిందని తెలిసింది. ఈ యథాతథ స్థితిని కొనసాగించడానికి 2021లో యాపిల్ కి గూగుల్ $15 బిలియన్లు చెల్లించిందని తెలిసింది.
ఇది గూగుల్ ఎవరికైనా చేసే అతిపెద్ద చెల్లింపు అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. యాపిల్ వార్షిక లాభాలలో ఐదో వంతు వరకు ఈ మొత్తం ఉంటుంది. అయితే ఇది గతంలో గూగుల్ గుత్తాధిపత్యాన్ని రక్షించడానికి.. పోటీని అరికట్టడానికి ఉపయోగించే చట్టవిరుద్ధమైన చెల్లింపు అని పలువురు అమెరికా న్యాయ శాఖ కు ఫిర్యాదు చేశారు.