Gautam Gambhir: “రాహుల్ ద్రావిడ్ కోపాన్ని అస్సలు ప్రదర్శించడు. జట్టు ఆటగాళ్లతో స్నేహంగా ఉంటాడు. అతడి శిక్షణలో మేమంతా గొప్పగా రాటు దేలాం. టీమిండియా ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం అతడే” ఇవీ ఇటీవల రాహుల్ ద్రావిడ్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు.
రాహుల్ ద్రావిడ్ పదవి కాలం ముగియడంతో.. అతని స్థానంలో గౌతమ్ గంభీర్ వచ్చాడు. వాస్తవానికి గౌతమ్ గంభీర్ టీమిండియా కు సుపరిచితమైన ఆటగాడు . 2007, 2011 లో టి20, వన్డే వరల్డ్ కప్ విజయాలలో అతడు ముఖ్య పాత్ర పోషించాడు. ఆటకు విరామం ప్రకటించిన తర్వాత శిక్షకుడిగా మారిపోయాడు. ఆ పాత్రనూ సమర్థవంతంగా పోషించాడు. దూకుడుతనం కలిగిన శిక్షకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను రూపొందించుకున్నాడు. అతడి దూకుడు ఈ ఏడాది ఐపిఎల్ లో కోల్ కతా ను విజేతగా నిలిపింది. ఈ విజయం గౌతమ్ గంభీర్ కెరియర్ ను మరో మలుపు తిప్పింది. ద్రావిడ్ పదవి కాలం మూసిన తర్వాత.. గౌతమ్ గంభీర్ ను టీమిండియా కోచ్ ను చేసింది. అయితే ఈ కొత్త పాత్రలో గౌతమ్ గంభీర్ ఎలా రాణిస్తాడనదే ఆసక్తికరంగా మారింది.
టి20 క్రికెట్ ఫార్మాట్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికారు. ఇప్పుడు వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేయాలి. అంతేకాకుండా వారిద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టాలి. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ ముందు ఉన్న అతిపెద్ద టాస్క్ ఇదే. టి20 జట్టును అలా పక్కన పెడితే.. వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో టీమిండియాలో సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, బుమ్రాను గౌతం ఎలా డీల్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ గతంలో చాలాసార్లు గొడవపడ్డారు. అయితే ఇటీవలి ఐపీఎల్లో వారిద్దరూ కలిసిపోయారు. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ టీం ఇండియాకు కోచ్ గా మారాడు. అతడి ఆధ్వర్యంలో టీమిండియా సీనియర్లు ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. గంభీర్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ మరింతకాలమో తన కెరియర్ కొనసాగించ లేడని ఇప్పటికే సోషల్ మీడియాలో అతని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ అది గనుక జరిగితే జట్టులో ఉన్న వాతావరణం పూర్తిగా దెబ్బతింటుంది. విరాట్ మాత్రమే కాకుండా రోహిత్ తో గంభీర్ ఎలా ఉంటాడనేది కూడా ఆసక్తికరంగా మారింది. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడు పెద్దన్న లాగా వ్యవహరించేవాడు. అయితే ఇప్పుడు ఆ పాత్రను గౌతమ్ గంభీర్ పోషించాల్సి ఉంటుంది.
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియాకు ఎన్నో విజయాలు అందించినప్పటికీ.. రావాల్సిన గుర్తింపు రాలేదని అతడి ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు గౌతమ్ గంభీర్ కు తనను తాను నిరూపించుకునే అవకాశం లభించింది. ఈ సమయంలో గౌతమ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది ఒకింత ఆసక్తికరంగా మారింది. శ్రీలంక పర్యటన ద్వారా అతను టీమిండియా కోచ్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆటగాళ్లలో ప్రతిభను పెంచడం, నాణ్యమైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం, కీలక టోర్నీలలో విజయం సాధించడం.. ఇలా పెద్ద పెద్ద టాస్క్ లు గౌతమ్ గంభీర్ ముందు ఉన్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2027 వన్డే వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే బలమైన జట్టును రూపొందించాలి. జట్టు కూర్పుపై సరికొత్త ప్రయోగాలు చేయాలి. ఇవన్నీ జరగాలంటే జట్టుపై అవగాహన కలిగి ఉండాలి. మరి ఇంతటి క్లిష్టమైన బాధ్యతలను గౌతమ్ ఎలా నిర్వర్తిస్తాడో వేచి చూడాల్సి ఉంది. కోల్ కతా జట్టుకు ఐపీఎల్ లో బ్యాటింగ్ కోచ్ గా ఉన్న అభిషేక్ నాయర్ ను తన సహాయక బృందంలోకి గౌతమ్ గంభీర్ తీసుకున్నాడు. కోరుకున్న కోచింగ్ టీం ను బీసీసీఐ ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. భారత జట్టును అతడు ఏ వైపు నడిపిస్తాడనేది ఒకింత ఆసక్తికరంగా మారింది.