Zimbabwe vs India : ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా.. వరుస విజయాలు సాధిస్తోంది. బుధవారం హారారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడవ టి20 మ్యాచ్లో సమష్టిగా రాణించి.. 23 పరుగుల తేడాతో జింబాబ్వే జట్టును ఓడించింది. ఈ గెలుపు ద్వారా టీమిండియా ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తేడాతో లీడ్ లో కొనసాగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది.. కెప్టెన్ గిల్ (49 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్ లతో 66) అర్థ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. రుతు రాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ లతో 36) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.. జింబాబ్వే బౌలర్లలో ముజరబని(2/25), సికిందర్ రజా(2/24) రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 159 రన్స్ చేసింది. మైర్స్(40 బంతుల్లో ఐదు ఫోర్ లతో 43*) మదండే(26 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్ లతో 37) టాప్ స్కోరర్ లుగా నిలిచారు. మిగతా ఆటగాళ్లు మొత్తం పూర్తిగా నిరాశపరిచారు. ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ (3/15) మూడు వికెట్లు పడగొట్టాడు. ఆవేష్ ఖాన్(2/22) రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఖలీల్ అహ్మద్ (1/15) ఒక వికెట్ పడగొట్టాడు.
భారత్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన జింబాబ్వే జట్టుకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది.. ఆవేష్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో మధేవెర్( 1) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్ ఖలీల్ అహ్మద్ వేశాడు. అతడి ఓవర్లో మారుమని(13) క్యాచ్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజ్ లోకి వచ్చిన బెన్నెట్(3) ను ఆవేష్ ఖాన్ పెవిలియన్ పంపించాడు. దీంతో నిండా 20 పరుగులు చేయకముందే జింబాబ్వే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మైర్స్, సికిందర్ రజా(15) స్థిరంగా ఆడారు. ఈ క్రమంలో పవర్ ప్లే ముగిసే నాటికి జింబాబ్వే మూడు వికెట్లు కోల్పోయి, 37 రన్స్ చేసింది.
ఈ దశలో బంతి అందుకున్న సుందర్ ఒకే ఓవర్లో మ్యాజిక్ చేశాడు.. ప్రమాదకరంగా మారుతున్న సికిందర్ రజా(15), కాంప్ బెల్(1) ను అవుట్ చేశాడు. ఈ దశలో 39 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి జింబాబ్వే దారుణమైన ఓటమి అంచనా నిలిచింది. ఈ పరిస్థితిలో మదండే, మైర్స్ భారత బౌలర్లను బలంగా ప్రతిఘటించారు. ఏకంగా ఆరో వికెట్ కు 77 పరుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో మదండే ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు.. మదండే ఔట్ అయినప్పటికీ.. మరో ఎండ్ లో ఉన్న మైర్స్ ఒంటరి పోరాటం చేశాడు.. అప్పటికే సాధించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడం.. ఓవర్లు కరిగిపోవడంతో.. జింబాబ్వే జట్టుకు మరో ఓటమి తప్పలేదు..