Zimbabwe vs India : హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వే తో జరుగుతున్న రెండవ టి20 మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ జూలు విధిల్చిచాడు. తొలి టి20 మ్యాచ్లో నిరాశపరచిన అభిషేక్ శర్మ.. రెండవ టి20 మ్యాచ్లో మాత్రం దుమ్మురేపాడు.. 47 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సహాయంతో సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ ద్వారా అభిషేక్ శర్మ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. 23 ఏళ్ల అభిషేక్ శర్మ ఐసిసి టి20 ఇంటర్నేషనల్ క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్ లలో సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టి20లో తొలి సెంచరీ సాధించేందుకు అభిషేక్ శర్మకు రెండు ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. మరో ఆటగాడు దీపక్ హుడా సెంచరీ చేసేందుకు మూడు ఇన్నింగ్స్ లు తీసుకున్నాడు.. కే ఎల్ రాహుల్ నాలుగు ఇన్నింగ్స్ లు ఆడి సెంచరీ సాధించాడు.
ఇక తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. 2017లో ఇండోర్ వేదికగా శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ సెంచరీ సాధించాడు. కేవలం 35 బంతుల్లోనే అతడు ఈ ఘనతను అందుకున్నాడు. 2023లో రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ శ్రీలంక జట్టుపై 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. 2016లో లౌడర్ హిల్ వేదికగా వెస్టిండీస్ చెట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 46 బంతుల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇక 2024 హరారే వేదికగా జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ 46 బంతుల్లోనే సెంచరీ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
టి20 ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో అతి తక్కువ వయసులో సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో యశస్వి జైస్వాల్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. 21 ఏళ్ల వయసులో యశస్వి నేపాల్ జట్టుపై 2023లో జరిగిన టి20 మ్యాచ్లో సెంచరీ సాధించాడు.. 23 ఏళ్ల వయసులో గిల్ సెంచరీ సాధించాడు. 2023 లో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. 2010లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో సురేష్ రైనా సెంచరీ చేశాడు. 23 ఏళ్ల వయసులో అతడు ఈ రికార్డు సృష్టించాడు. ఇక 2024 హరారే వేదికగా జింబాబ్వే జట్టుపై జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. 23 ఏళ్ల వయసులో అతడు ఈ ఘనతను అందుకున్నాడు.