https://oktelugu.com/

Zimbabwe Vs India: జింబాబ్వే టూర్.. టీమిండియా అభిమానులకు షాకింగ్

జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది.. టీమిండియాకు గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఆటగాళ్లు జింబాబ్వే చేరుకున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 6, 2024 11:32 am
    Zimbabwe Vs India

    Zimbabwe Vs India

    Follow us on

    Zimbabwe Vs India: వన్డే వరల్డ్ కప్ ను ఉచితంగా చూసే అవకాశాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కల్పించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఎటువంటి రుసుము లేకుండా చూసే వెసలుబాటును జియో సినిమా అందించింది. మొన్నటికి మొన్న జరిగిన టి20 వరల్డ్ కప్ ను కూడా పైసా ఖర్చు లేకుండా చూసే సదుపాయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మరలా కల్పించింది. దీంతో టీమిండియా అభిమానులు పండగ చేసుకున్నారు. క్రికెట్ మ్యాచ్ ఉంటే చాలు విరగబడి చూశారు. ముఖ్యంగా టీమిండియా ఆడిన మ్యాచ్ లనైతే రెప్ప వాల్చకుండా చూశారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రారంభమయ్యే జింబాబ్వే – టీమిండియా టి20 సిరీస్ కూడా ఉచితంగా చూసే అవకాశం ఉంటుందని అభిమానులు అనుకున్నారు. కానీ వారి ఆశలపై సోనీ లీవ్ నీళ్లు చల్లింది.

    జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది.. టీమిండియాకు గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఆటగాళ్లు జింబాబ్వే చేరుకున్నారు. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో ఐదు టీ – 20 మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఈ సిరీస్ నేపథ్యంలో అభిమానులకు సోనీ లీవ్ షాకింగ్ న్యూస్ చెప్పింది.. ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించలేమంటూ స్పష్టం చేసింది. అయితే టీవీలో మాత్రం సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్ లో ఉచితంగా చూడొచ్చు. ఈ సిరీస్ లో అన్ని మ్యాచ్ లు సోనీ లీవ్ యాప్ లో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. మీరు మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లో ఉచితంగా చూసేందుకు అవకాశం ఉండదు. దీనికి సబ్క్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది. చందా ధర 399 నుంచి 1499 వరకు ఉంది. ఈ మ్యాచ్ లు మొత్తం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4: 30 నిమిషాలకు ప్రారంభమవుతాయి.. టాస్ ప్రక్రియ నాలుగు గంటలకు మొదలవుతుంది.. జింబాబ్వేలో ఎక్కువగా క్రికెట్ మైదానాలు లేకపోవడంతో.. హరారే స్పోర్ట్స్ క్లబ్ లో మాత్రమే మొత్తం మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు.

    సోనీ లీవ్ నిర్ణయం నేపథ్యంలో టీమిండియా అభిమానులు పెదవి విరుస్తున్నారు.. డిస్నీలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉచితంగా చూసే అవకాశం కల్పించినప్పుడు.. సోనీ మాత్రం అలా చేయకుండా డబ్బుల కోసం కక్కుర్తి పడుతోందని ఆరోపిస్తున్నారు..”జియో సినిమా కూడా ఐపీఎల్ మ్యాచ్లను ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించింది. కానీ సోనీ మాత్రం పక్కా కమర్షియల్ మంత్రాన్ని జపిస్తోంది. రుసుము చెల్లిస్తేనే మ్యాచులు చూసే అవకాశం ఉందని స్పష్టం చేస్తోంది. ఒకరకంగా అభిమానాన్ని క్యాష్ చేసుకుంటున్నదని” అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు.

    జింబాబ్వే లో ఆడే భారత జట్టు ఇదీ(అంచనా మాత్రమే)

    గిల్(కెప్టెన్), హర్షిత్ రాణా, జితేష్ శర్మ, ఆవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, సుశాంత్, రుతు రాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, జురెల్.