Amaravati: అమరావతికి కేంద్రం కీలక సాయం!

సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత అమరావతి రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టారు. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ఏలుబడిలో అమరావతి పూర్తి నిర్వీర్యం అయ్యింది.

Written By: Dharma, Updated On : July 6, 2024 11:29 am

Amaravati

Follow us on

Amaravati: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలుసుకున్న చంద్రబాబు తమ ప్రాధాన్యత ప్రాజెక్టులను వారి దృష్టికి తీసుకొచ్చారు. అమరావతి తో పాటు పోలవరం తమ తొలి ప్రాధాన్యం అని చెప్పకనే చెప్పారు. వాటితో పాటు కేంద్ర ప్రాజెక్టులకు మోక్షం కల్పించాలని కూడా కోరారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర పరంగా చేయాల్సిన సాయం కోసం కీలక ప్రతిపాదనలు వారి ముందు పెట్టారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించింది. చంద్రబాబు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ కేంద్ర ప్రాజెక్టులు అమరావతి రాజధాని నిర్మాణంలోనివే కావడం విశేషం.

సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత అమరావతి రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టారు. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ఏలుబడిలో అమరావతి పూర్తి నిర్వీర్యం అయ్యింది. గతంలో టిడిపి ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలపై అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. ఆ ప్రతిపాదనలనే కేంద్ర పెద్దలకు నివేదించారు చంద్రబాబు. అన్నింటికంటే రవాణా ముఖ్యం కావడం.. అమరావతి రాజధాని అభివృద్ధికి రహదారుల నిర్మాణం కీలకం కావడంతో ఫోకస్ పెట్టారు చంద్రబాబు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరితో భేటీ అయిన చంద్రబాబు అమరావతి తో పాటు రాష్ట్రంలో చేపట్టాల్సిన రోడ్డు నిర్మాణాలపై ప్రతిపాదించారు. అమరావతి ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్డు తో పాటు విజయవాడలోని కీలక ప్రాంతాలను కలిపి తూర్పు బైపాస్ నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు కోరారు. ఈ విన్నపానికి గడ్కరి సానుకూలంగా స్పందించారు.

రాజధాని అమరావతిలో కీలకం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 1089 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే ముందుకు వచ్చింది. పెరిగిన ట్రాఫిక్, నూతన వాహనాల తీరును దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక టెక్నాలజీతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని నితిన్ గడ్కరి సీఎం చంద్రబాబుకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అమరావతికి మణిహారంగా ఈ రహదారి నిలుస్తుందని.. అందుకు ఖర్చు ఎంతైనా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి గడ్కరి హామీ ఇచ్చారు. 18 వేల కోట్లతో ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ వ్యాప్తంగా ఉన్న 3700 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలన్న చంద్రబాబు ప్రతిపాదనకు గడ్కరి సానుకూలంగా స్పందించారు. మొత్తానికైతే అమరావతి మణిహారం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ముందుకు రావడం విశేషం.