ZIM vs IND : పులి జింకను వేటాడటం పెద్ద మ్యాటర్ కాదు. కానీ అదే జింక పులికి ఎదురు తిరిగి.. తన కొమ్ములతో గాయం చేస్తేనే మ్యాటర్.. హరారే స్పోర్ట్స్ క్లబ్లో శనివారం జరిగింది ఇదే. సరిగ్గా వారం క్రితం టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించి.. కప్ అందుకున్న టీమిండియా.. సరిగ్గా వారం గడిచిన తర్వాత పసి కూన జింబాబ్వే చేతిలో ఓడిపోయింది. వాస్తవానికి సీనియర్ ఆటగాళ్లు లేరు, కాబట్టి ఓడిపోయిందని చాలామందికి చెప్తూ ఉండొచ్చు. కానీ జింబాబ్వే ఆటగాళ్లు టాప్ క్లాస్ ప్లేయర్లు కాదనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి.. వాస్తవానికి పసి కూనలాంటి జట్టు ఏకంగా భారత్ ను ఓడించింది అంటే మామూలు విషయం కాదు. అయితే జింబాబ్వే జట్టు ఈ స్థాయిలో ప్రదర్శన చూపడానికి ప్రధాన కారణం ఆ టీం కెప్టెన్ సికిందర్ రజా.. ఇంతకీ ఇతడు ఆ జట్టును ఎలా మలిచాడంటే..
సరిగ్గా 15 సంవత్సరాల క్రితం అండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్ లాంటి ఆటగాళ్లతో జింబాబ్వే ఒక స్థాయి జట్టు లాగా ఉండేది. పర్వాలేదనే స్థాయిలో ప్రదర్శన చూపేది. కానీ రానూ రానూ ఆ జట్టు ఆట దారుణంగా మారిపోయింది. కేటాయింపులు లేకపోవడం, దేశంలో దుర్భర దారిద్రం వల్ల క్రికెట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చివరికి జట్టు ఆటగాళ్లు షూ కూడా కొనుక్కోలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఐసీసీ కాస్తలో కాస్త కేటాయింపులు పెంచడం.. పెద్ద పెద్ద జట్లు ఆడేందుకు రావడంతో.. జింబాబ్వే లో క్రికెట్ పరిస్థితి కాస్త మెరుగయింది. ఇదే క్రమంలో సికిందర్ రజా రూపంలో ఆ దేశ జట్టుకు ఆపద్బాంధవుడు లభించాడు. ఫలితంగా ఆ జట్టు.. టీమ్ ఇండియా లాంటి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ జట్టును ఓడించగలిగింది.
సికిందర్ రజా పుట్టింది పాకిస్తాన్లో అయినప్పటికీ.. జింబాబ్వే జట్టుకు ఆడుతున్నాడు. అతని కుటుంబం ఎప్పుడో జింబాబ్వేలో స్థిరపడింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో సత్తా చాటే నేర్పరితనం రజా సొంతం. పైగా అతడికి ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉంది. అందువల్లే తొలి మ్యాచ్లో టీమ్ ఇండియా ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టగలిగాడు. ఏకంగా మూడు వికెట్లు పడగొట్టగలిగాడు. అతని బౌలింగ్లో టీమిండియా ఆటగాళ్లు కనీసం బంతిని కూడా టచ్ చేసేందుకు భయపడ్డారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..
రజా నాయకత్వంలో జింబాబ్వే స్థిరమైన ఆట తీరును ప్రదర్శిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతో జరిగిన టెస్ట్, వన్డే మ్యాచ్లలో మెరుగైన ఆట తీరును కొనసాగించింది. సికిందర్ రజా ఆ జట్టు ఆటగాళ్లలో పోరాటస్ఫూర్తిని రగిలించడంలో సఫలికృతులయ్యాడు. అందువల్లే ఆ జట్టు ఆటగాళ్లు గత కొంతకాలంగా సమష్టి ప్రదర్శనకు అలవాటుపడ్డారు. అందువల్లే సంచలన విజయాలు నమోదు చేస్తున్నారు. టీమిండియాతో జరిగిన తొలి t20 మ్యాచ్లో 115 పరుగులు మాత్రమే చేసిన జింబాబ్వే.. చివరి వరకు పోరాడి ఆ లక్ష్యాన్ని కాపాడుకుందంటే మామూలు విషయం కాదు.. జింబాబ్వే లో మొత్తం నలుగురు ఆటగాళ్లు 0 పరుగులకే వెనుతిరిగినప్పటికీ మదాండే 29 , బెనెట్ 22, వెస్లీ 21, మేయర్స్ 23 పరుగులు చేశారు.. తొలుత వెంట వెంటనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత జింబాబ్వే భారత బౌలర్లను ప్రతిఘటించింది.
ఒకప్పటి జింబాబ్వే ఇలా ఉండేది కాదు. టాప్ ఆర్డర్ మొత్తం పేక మేడను తలపించేది. రజా కెప్టెన్సీ స్వీకరించిన తర్వాత ఒక్కసారిగా జింబాబ్వే జట్టు పరిస్థితి మారిపోయింది.. అది భారత్ లాంటి బలమైన జట్టును కూడా మట్టికరిపించే స్థాయికి ఎదిగింది. ఈ సిరీస్ లో ఇంకా నాలుగు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటిల్లోనూ జింబాబ్వే ఇదే ఆట తీరు ప్రదర్శిస్తే టీమిండియా కు కష్టాలు తప్పవు. అన్నట్టు సౌకర్యాలు లేకపోయినప్పటికీ, మైదానాలు లెక్కకు మిక్కిలి లేకపోయినప్పటికీ కేవలం ఆట మీద ప్రేమతోనే జింబాబ్వే క్రీడాకారులు క్రికెట్ ఆడుతున్నారు. ఆ ఆటలోనే ఆనందం వెతుక్కుంటున్నారు. ఈ ఆనందాన్ని వారికి పరిచయం చేసింది ముమ్మాటికి సికిందర్ రజా అనడంలో ఎటువంటి సందేహం లేదు.