IPL 2024: అతడు చూడ్డానికి బక్క పలుచగా ఉంటాడు. ఇతడేం బౌలింగ్ చేస్తాడని, అతడు బంతులు వేస్తే చితక్కొట్టొచ్చని బ్యాటర్లు అనుకుంటారు. అనుకోవడం కాదు అనుకునేలా చేస్తాడు. ఆ తర్వాతనే తన అసలు మ్యాజిక్ మొదలు పెడతాడు. బంతులను మెలి తిప్పుతాడు. బ్యాటర్లను తికమక పెడతాడు. అంతిమంగా వికెట్ దక్కించుకుంటాడు. ఇలా ఈ ఐపీఎల్లో అతని ప్రదర్శన అద్భుతం.. అనన్య సామాన్యం. అతడు ఆడుతున్న జట్టు పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది అంటే.. అందులో అతని పాత్ర అత్యంత కీలకం. అటువంటి ఆటగాడు 17 సంవత్సరాల చరిత్ర ఉన్న ఐపిఎల్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. మరే బౌలర్ కూడా కలలో కూడా ఊహించని ఘనతను అందుకున్నాడు.
ముంబై ఇండియన్స్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఏస్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ సరికొత్త ఘనతను లిఖించాడు. 17 సంవత్సరాల చరిత్ర ఉన్న ఐపీఎల్లో ఒకే ఒక్క బౌలర్ గా అరుదైన ఘనత అందుకున్నాడు. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ నబీ వికెట్ తీసి.. ఐపీఎల్ చరిత్రలో రెండు వందల వికెట్లు తీసిన తొలి బౌలర్ గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా ఆ ఘనత సాధించలేదు. 153 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన చాహల్.. 200 వికెట్లు పడగొట్టాడు. అతడి తర్వాత వెస్టిండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో 161 మ్యాచ్లలో 183 వికెట్లు సాధించి రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడి తర్వాత పీయుష్ చావ్లా 181, భువనేశ్వర్ కుమార్ 174, అమిత్ మిశ్రా 171 వికెట్లతో తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 13 వికెట్లు పడగొట్టి చాహల్ బుమ్రా, హర్షల్ పటేల్ తో సమానంగా కొనసాగుతున్నాడు.
బంతిని మెలికలు తిప్పడంలో చాహల్ సిద్ధహస్తుడు. మైదానానికి తగ్గట్టుగా అతడు బంతులు వేయగలడు. బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టగలడు. ఊరించే బంతులు వేసి వికెట్ల ముందు దొరకబుచ్చుకోగలడు. పదునైన బంతులతో వికెట్లు గిరాటేయగలడు . తనదైన రోజు మ్యాచ్ మొత్తాన్ని సమూలంగా మార్చేయగలడు. అందువల్లే రాజస్థాన్ జట్టు ఇతడిని తన స్టార్ బౌలర్ గా ప్రకటించింది.. ఇప్పటివరకు ఆ జట్టు సాధించిన విజయాలలో చాహల్ పాత్ర వెలకట్టలేనిది. ఈ సీజన్లో లో స్కోర్ మ్యాచ్ లలోనూ రాజస్థాన్ గెలుస్తోంది అంటే.. దానికి కారణం చాహల్ బౌలింగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.