IPL 2024: అతడు వెటరన్ పేసర్.. నిప్పులు చెరిగే విధంగా బంతులు వేయగలడు. డెత్ ఓవర్లను సమర్థవంతంగా పూర్తి చేయగలడు. కానీ అదేం దుదృష్టమో.. అతడి ప్రతిభకు తగ్గట్టుగా అవకాశాలు రాలేదు. అయినప్పటికీ అతడు కుంగిపోలేదు. అవకాశాలు రాలేదని బాధపడలేదు. దేవుడు కరుణించాడో.. లేకుంటే మరేం అద్భుతం జరిగిందో తెలియదు గాని.. అతడికి ప్రతిభను ప్రదర్శించే సందర్భం వచ్చింది. దీంతో అతడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.
ముంబై ఇండియన్స్ జట్టుతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేసిన అతడు 4.50 ఎకనామితో ఐదు వికెట్లు పడగొట్టాడు.. పవర్ ప్లే లో ముంబై కీలక ఆటగాళ్లు కిషన్ (0), సూర్య కుమార్ యాదవ్ (10), ను వెనక్కి పంపించిన సందీప్ శర్మ.. డెత్ ఓవర్లలో తిలక్ వర్మ 65, డేవిడ్ 3, కోయిట్జీ(0) ను అవుట్ చేసి పెవిలియన్ పంపాడు. సందీప్ శర్మ బౌలింగ్ ధాటికి ముంబై ఇండియన్స్ జట్టులో ఇద్దరు కీలక ఆటగాళ్లు గోల్డెన్ డక్ గా వెనుతిరిగారు. సోమవారం నాటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు పతనాన్ని శాసించిన సందీప్ శర్మ.. ఈ సీజన్లో కేవలం మూడు మ్యాచులు మాత్రమే ఆడాడు. ఆరు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. డెత్ ఓవర్లలో అతడు బౌలింగ్ చేస్తున్న విధానం అద్భుతంగా ఉంది. బ్యాటర్ల దూకుడు నడుస్తున్న ఈ సీజన్లో అతడు తన బంతితో మాయాజాలం చేస్తున్న తీరు తోటి ఆటగాళ్లను అమితంగా ఆకట్టుకుంటున్నది. ఫలితంగా అప్పట్లో సందీప్ శర్మకు 50 లక్షలు ఇస్తుంటే, ఇతడికి ఎందుకు అంత ధర అని నొసలు చిట్లించిన వారే.. వికెట్లు తీస్తుంటే చప్పట్లు కొడుతున్నారు.
2023 సీజన్ కు సంబంధించి ఐపిఎల్ నిర్వహించిన మెగా వేలంలో సందీప్ శర్మను యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోలేదు. 50 లక్షల కనీస ధరకు కూడా అతన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా అతడు అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంతో సందీప్ శర్మ బాధపడ్డాడు. దిగులు చెందాడు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ జట్టులో ఒక ఆటగాడు గాయపడి.. జట్టుకు దూరమయ్యాడు. దీంతో రాజస్థాన్ జట్టు ఆ స్థానాన్ని సందీప్ శర్మతో భర్తీ చేసింది. అయితే వచ్చిన అవకాశాన్ని సందీప్ శర్మ సద్వినియోగం చేసుకున్నాడు. అద్భుత ప్రదర్శన కనబరిచి డెత్ ఓవర్ల మాంత్రికుడిగా మారిపోయాడు. తోటి ఆటగాళ్ల నుంచి మొదలు పెడితే విమర్శకుల వరకు ప్రశంసలు అందుకుంటున్నాడు. ఫలితంగా రాజస్థాన్ జట్టు అతడిని కొనసాగిస్తోంది. సీజన్ ప్రారంభంలో అతడు గాయపడ్డప్పటికీ.. పడి లేచిన కెరటం లాగా దూసుకు వచ్చాడు. అద్భుతమైన ప్రదర్శనతో రాజస్థాన్ జట్టు సాధిస్తున్న విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతడి బౌలింగ్ చూసి.. 24.75 కోట్లు పెట్టి స్టార్క్ కంటే సందీప్ శర్మ కోటిపాళ్ళు నయమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.